Russia vs Ukraine : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య ఐదేళ్లుగా యుద్ధం (War) కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగాయి. రెండు దేశాలు భారీగా సైనికుల (Soldiers) ను కోల్పోయాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ వెయ్యికిపైగా డ్రోన్ల (Drones) తో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చేసిన ఈ దాడుల్లో ఎనిమిది వందల డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ (Russia Defence Ministry) తెలిపింది.
మాస్కోలోని పలు ప్రదేశాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరగడంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ వ్యాపించింది. ఈ దాడుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దాంతో పలు విమానాలు రద్దవ్వగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
గత ఐదేళ్లలో కీవ్.. మాస్కోపై చేసిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటని రష్యా మీడియా కథనాలు వెల్లడించాయి. క్రిమియాపైనా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థలను స్తంభింపజేసేలా తాజా దాడులు జరిపింది. క్రిమియాలోని క్షిపణి వ్యవస్థలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు తెల్లవారుజామున కీవ్లోని అనేక ప్రాంతాలపై రష్యా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులతో అనేక నివాసాలు, దుకాణాలు తగులబడ్డాయి.