అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) కు జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా తీరిక లేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ( Kalisetti Appalanayudu ) విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశమంతా 80వ స్వాంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటే జగన్ మాత్రం జెండాను ఎగురవేయడానికి బద్ధకించారని ఆరోపించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న సీతారావమ్మ అనే వృద్ధురాలు జెండా పట్టుకుని దేశభక్తిని చాటారు. ఆమెను చూసి జగన్ సిగ్గుపడాలి. దేశంపై జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి జెండా ఎగురవేయక పోవడమే నిదర్శనమని దుయ్యబట్టారు.
జగన్‌కు జెండా అంటే ఎంత గౌరవమో ఈ సంఘటన చూస్తే తెలుస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ జెండాను ఎగురవేయడం కంటే తప్పులు చేసి జైల్లో ఉన్న రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను పరామర్శించేందుకు జగన్‌కు తీరిక ఉంటుందని విమర్శించారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని పేర్కొన్నారు.