హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖను తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ శాఖను నిర్వీర్యం చేస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే దగ్గర విద్యనందిస్తామని కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసిన నాలుగు స్కూళ్లల్లోను ఇదే జరిగింది. త్వరలోనే మరికొన్ని టీపీఎస్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం వెలుగులోకి తీసుకొచ్చింది. ‘సర్కార్ బడుల మూత’ పేరిట టీపీఎస్‌ల విషయంలో జరుగుతున్న తతంగాన్ని ప్రచురించింది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు సర్కార్ వైఖరిని తప్పుబడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) పేరిట సర్కార్ బడులను మూసివేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ఉద్యమిస్తామని పేర్కొంటున్నారు. బడుల మూసివేత అంటే విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కడమేనని మండిపడుతున్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట సర్కార్ బడులను మూసివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్టీఈ నిబంధనలు అమలవుతున్న ఈ తరుణంలో ఉన్న పాఠశాలల సంఖ్యను తగ్గించి.. కొన్ని కేంద్రాల్లోనే విద్యను కేంద్రీకరించడం తిరోగమన చర్యగా అభివర్ణించారు. తండాలకు చెందిన చిన్నారులు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పేర్లు , విలీనం , క్లస్టర్లుగా మార్చడం వంటివి సంస్కరణ కిందికి రావని తెలిపారు. సర్కార్ బడులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
పేద పిల్లల విద్యాహక్కు కోసం ఉద్యమిస్తామని ఎస్టీయూ టీఎస్ మాజీ అధ్యక్షుడు భుజంగరావు హెచ్చరించారు. విద్యను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం.. పాఠశాలలను తగ్గించడం విద్యాహక్కులను దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు. విద్యా కేంద్రీకరణ పేద విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. బడులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
బడుల విలీనం, మూసివేతను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ తెలిపారు. బడుల పరిరక్షణకు భారీ ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 17వేల పైచిలుకు స్కూళ్లల్లో 100లోపు విద్యార్థులున్నారని, 7,629 పాఠశాలల్లో 30 మందిలోపే విద్యార్థులున్నారని పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య, ఎన్రోల్మెంట్ తగ్గడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.