సీబీఎస్ఈలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరి త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 7,8,9 తరగతుల విద్యార్థులకు ఇచ్చిన మినహాయింపును 6వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థులకు ఈ విధానాన్ని 2027 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని పేర్కొంది.
భాషా విధానంలో అకస్మాత్తుగా మార్పు చేయడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతున్నదని తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కొత్త భాషలను చదవాల్సి రావడం, అవసరమైన పాఠ్యపుస్తకాలు భౌతికంగా అందుబాటులో లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సుమారు 1.2 శాతం పాఠశాలలకే ఇబ్బందులు ఉన్నాయన్నారు.