భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో వివాదాస్పదులు, అతి వివాదాస్పదులు అయిన చట్టసభల స్పీకర్లు ఎవరు? వారు ఎందరుంటారు? దిగువ సభల వారిని స్పీకర్లు అని, ఎగువ సభల వారిని చైర్మన్లు అంటారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా గల ఉభయ సభల వరకు గల వారు ఈ 80 ఏండ్లలో వందల మంది ఉంటారు. వీరుగాక, సభాపతులు లేని సమయాల్లో తాత్కాలికంగా అధ్యక్షత వహించే ప్యానెల్ సభ్యులుంటారు. వారిని కూడా కలిపితే అనేక వేలవుతారు. సంఖ్య ఎంతైనప్పటికీ ప్రతి ఒక్కరి బాధ్యతా సభా వ్యవహారాలు అన్నింటినీ నియమ నిబంధనల ప్రకారం, నిష్పక్షపాతంగా నిర్వహించటం. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాపాడటం. వీరందరిలో అట్లా నడుచుకున్నవారు ఎందరుంటారు? ఆ స్థానానికి అప్రతిష్టను తెచ్చినవారు ఎందరుంటారు?
ఈ ప్రశ్నల ప్రకారం ప్యానెల్ సభ్యులను వదలివేసినా తక్కినవారి విషయమేమిటి? స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, సభాపతుల గురించి పేరు పేరునా జరిగిన అధ్యయనాలు ఏవీ ఉన్నట్టు లేవు. ఆ పని జరగటం ఎంతైనా ఉపయోగపడుతుంది. అయితే పేర్లవారీగా అధ్యయనాలు లేకపోయినా స్థూలంగా ఎవరేమిటన్న వ్యాఖ్యానాలు సమకాలీనంగా వెలువడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మొదటి స్పీకర్ జీవీ మావ్లంకర్ (1952-56) నుంచి మొదలుకొని ఎం.ఏ అయ్యంగార్ (1956-62), సర్దార్ హుకుమ్‌సింగ్ (1962-67), నీలం సంజీవరెడ్డి (1967-69, 1977) వరకు బాగా చెప్పుకొంటారు. తర్వాత నుంచి మొదలైన వివాదాలు నేటికీ కొనసాగుతున్నాయి.
ఈ నలుగురిలోనూ సంజీవరెడ్డికి ఒక ప్రత్యేకత ఉన్నది. స్పీకర్‌గా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అట్లా చేసిన మొదటి నాయకుడు ఆయన. స్పీకర్‌గా తటస్థంగా పని చేయాలంటే రాజీనామా అవసరమన్నారు. మొదటి స్పీకర్ మావ్లంకర్ పూర్తి నిష్పక్షపాతే. కానీ రాజీనామా చేయలేదు. అందుకు తను చెప్పిన కారణం, తిరిగి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందనే నమ్మకం లేదన్నది. మాజీ స్పీకర్లపై ఏ పార్టీ కూడా పోటీ పెట్టని బ్రిటిష్ సంప్రదాయాన్ని ఇక్కడ అమలుకు తేవాలని ఆయన సూచించారు గానీ అందుకు ప్రతిపక్షాలు ఒప్పుకోకపోవచ్చునంటూ అప్పటి ప్రధాని నెహ్రూ నిరాకరించారు. అదే సమయంలో విశేషమేమంటే, ఒకవేళ మావ్లంకర్ రాజీనామా చేసినట్టయితే మరుసటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వగలదనే హామీని మాత్రం ఇచ్చినట్టులేదు. ఇది ఇంతగా రాయటం ఎందుకంటే, స్పీకర్లూ వారి పార్టీల మధ్య సంబంధం చర్చ ఆ విధంగా మొదటి లోక్‌సభ నుంచే కొనసాగుతూ వస్తున్నది. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి, పార్లమెంటరీ సంప్రదాయాల నుంచి అనేకం అనుసరించిన మన పెద్దలు ఎందువల్లనో గానీ ఈ ఉత్తమమైన పద్ధతిని మాత్రం పక్కకుపెట్టారు. ఈ లోపం క్రమక్రమంగా, ముఖ్యంగా నెహ్రూ తర్వాత కాలం నుంచి అనేక అనర్థాలకు దారితీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ అయితే ప్రతిరోజూ కాంగ్రెస్ కండువాతో సభాపతి స్థానాన్ని అలంకరిస్తూ అందులో తప్పేమీ లేదని వాదించారు. ఆ పని దేశంలో మరెవరూ చేసినట్టులేరు.
అధికార పార్టీలు తమ సంఖ్యాబలం వల్ల ఎన్నిక చేసిన స్పీకర్లను ఎన్నెన్ని విధాలుగా ఒక ఆయుధంగా మార్చుకుని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దుర్వినియోగపరుస్తున్నాయో లోక్‌సభ నుంచి మొదలుకొని వివిధ రాష్ర్టాల అసెంబ్లీల వరకు చూస్తూనే వస్తున్నాము. లోక్‌సభలో ఈ ధోరణి మితిమీరటం బలరాం జాఖడ్, శివరాజ్ పాటిల్‌తో మొదలైంది. స్పీకర్లను అధికారపక్షాలు దుర్వినియోగపరచటం వేర్వేరు రూపాల్లో కనిపిస్తూ వస్తున్నది.
రోజువారీ సభాకార్యక్రమాల్లో ప్రతిపక్షాలకు తగిన సమయం ఇవ్వకపోవటం, వారి ప్రసంగాలు ప్రధానమంత్రికి లేదా ముఖ్యమంత్రికి, లేదా ప్రభుత్వానికి ఇబ్బందికరమనిపించినప్పుడు మైక్ కట్ చేయటం, వారి చర్చా తీర్మానాలను నిర్హేతుకంగా తోసిపుచ్చటం, ప్రశ్నలకు మంత్రులు తగిన సమాధానాలు ఇవ్వకున్నా వారిని కాపాడటం, పాయింట్ ఆఫ్ ఆర్డర్లను నిరాకరించటం, ప్రతిపక్షాలపై విరుచుకుపడి మాట్లాడనివ్వని అధికారపక్షాన్ని నియంత్రించకపోవటం, ప్రతిపక్ష సభ్యులను కాపాడకపోవటం వంటి దుర్వినియోగాలు సర్వసాధారణంగా మారాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి ఇదికూడా ఒక సూచిక అయింది. స్పీకర్లు ఇంతకుమించిన ఆయుధాలుగా మారుతున్నది ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపులు, అధికారపక్షంలో చేరటాలు, ఆ ప్రక్రియలకు గుర్తింపునివ్వటం వంటి సందర్భాల్లో. ఈ జాడ్యం లోక్‌సభ నుంచి అసెంబ్లీల వరకు కనిపిస్తున్నది. సభా ప్రాంగణం, సభ అంతర్భాగం, వాటిలో జరిగే కార్యక్రమాలు, వ్యవహారాలు సభాపతి ఆధీనంలోకి వస్తాయని వాటికి సంబంధించి ఆయన నిర్ణయాలను కోర్టులు సైతం ప్రశ్నించజాలవనే సంప్రదాయాన్ని, నిబంధనలను అనువుగా చేసుకుంటూ ఈ దుర్వినియోగాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను కొందరు స్పీకర్లు బాహాటంగా ధిక్కరించిన సందర్భాలను కూడా చూశాము. కోర్టులు సర్వసాధారణంగా, చట్ట సభలు, ఎన్నికల కమిషన్ వంటివి రాజ్యాంగ వ్యవస్థలు అయినందున వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవు. స్పీకర్లను దుర్వినియోగపరిచే అధికారపక్షాలకు, స్వయంగా స్పీకర్లకు కూడా ఒక్కోసారి ఇది అనువుగా మారుతున్నది. దానితో, ఉన్న నిబంధనలకు ఇష్టారీతిన నిర్వచనాలు చెప్పటం, లేని నిర్వచనాలు ఇవ్వటం కూడా జరుగుతున్నది. అటువంటి నిర్వచనాలను కోర్టులు స్పష్టమైన రీతిలో తోసిపుచ్చి, పార్టీ ఫిరాయింపులను చెల్లనివిగా ప్రకటించటం ఇటీవల తెలంగాణ సహా కొన్ని అసెంబ్లీల విషయంలో చేయటాన్ని చూశాము. అనగా స్పీకర్ల సృజనాత్మక నిర్వచనాలు రాజ్యాంగ విధివిధానాలకు, చట్ట నియమాలకు విరుద్ధమైనవన్నమాట.
సమస్య ఏందంటే దేశంలో ఇటువంటి ధోరణులు, దుర్వినియోగాలు పెరుగుతున్నాయి. వ్యవస్థలు, రాజకీయ నీతినియమాల క్షీణత వల్ల మొదలైన ఆయా రామ్.. గయా రామ్ సంస్కృతిని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ఆరంభించినా, దానిని అరికట్టేందుకు ప్రయత్నించిన ఖ్యాతి కూడా ఒక కాంగ్రెస్ ప్రధాని (రాజీవ్‌గాంధీ)కే చెందుతుంది. తిరిగి దానిని ధ్వంసం చేస్తున్నది, అందుకు సృజనాత్మక నిర్వచనాలు ఇస్తున్నది, స్పీకర్లతో ఇప్పిస్తున్నది సైతం అదే పార్టీ. అదే సంస్కృతి అన్ని పార్టీలకు పాకింది. ఫిరాయింపులు, చీలికలు, గుర్తింపులు, ప్రభుత్వాల ఏర్పా ట్లు, బలనిరూపణలకు సంబంధించి ఎస్.ఆర్ బొమ్మై కేసు ఒక ప్రముఖమైన ఉదాహరణ. తర్వాత ఎన్టీఆర్ సందర్భం. విషాదం ఏందంటే నిబంధనలు, నీతులు, తీర్పులు ఏవైనా, చట్టాలను తామే చేసినా, అన్నింటిని వమ్ము చేయటానికి స్పీకర్లు సాధనాలుగా ఉపయోగపడుతున్నారు. అధికారం కోసం నిబంధనలను బలి ఇవ్వగల అధికారం వారి చేతిలో ఉన్నది గనుక. పుణ్యం పురుషార్థమన్నట్టు తామూ ఏవో లాభాలను ఆశిస్తారు గనుక. ఈ పరిస్థితులను, పరిణామాలను గమనించినప్పుడు స్పీకర్ల గురించి చర్చించటం, ఏదైనా ఆశించటం కూడా అర్థరహితమైనదేమో. అది ఒక విధంగా గొంగట్లో కూర్చుని తింటూ వెంట్రుకలు ఏరటం వంటిది. అందువల్ల వివాదాస్పద స్పీకర్లు, అతి వివాదాస్పద స్పీకర్లు అంటూ అధ్యయనాలు చేయటం అకడమిక్ థీసిస్‌ల కోసం ఉపయోగపడటం తప్ప ఆచరణాత్మకమైన ఉపయోగం ఏమీ ఉండదు. దేశరాజకీయాలు, అధికార రాజకీయాలు శీఘ్రగతిన పతనమవుతున్నప్పుడు, ఎవరైనా నియమబద్ధుడైన స్పీకర్ ఎప్పుడైనా, ఎక్కడైనా ఆవిష్కృతుడు అయితే తన గురించి అందరూ తమంతట తామే చెప్పుకొంటారు. అటువంటి మావ్లంకర్లను, సంజీవరెడ్డిలను ఆ పార్టీ స్పీకర్లుగా ఎంపిక చేసుకుంటాయా అన్నది వేరే ప్రశ్న.
దీనంతటిని ఆవరించి ఉన్న విస్తృత సమస్యలు కొన్ని ఉన్నాయి. అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం స్పీకర్ స్థానం సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను బలహీనపరుస్తున్నారు. చట్ట సభలు, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, స్పీకర్ వ్యవస్థ మొదలైనవన్నీ అందులోకి వస్తాయి. ఈ ధోరణి ఇందిరాగాంధీతో మొదలైంది, అధికారపక్ష పరిరక్షణ కోసం. స్పీకర్ల దుర్వినియోగం గానీ, స్పీకర్లు అధికారపక్షాలకు ఉపయోగపడటం గానీ తక్కిన పరిణామాలతో సంబంధం లేకుండా జరుగుతున్నవి కావు. అన్నీ పరస్పరం సంబంధం గలవి.
దీనంతటికీ మూలాలు మన పార్టీలూ, ప్రభుత్వాలూ ప్రజల మేలును, అభివృద్ధిని విస్మరించి తమ అధికారానికి, సంపాదనలకు ప్రాధాన్యతనివ్వటంలో ఉన్నాయి. ఈ ధోరణి అవినీతికి దారితీయగా, అది నిరాఘాటంగా సాగటం కోసం వివిధ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్నారు. ఇదే క్రమంలో స్పీకర్లు కూడా పావులవుతున్నారు.. జ్ఞానేశ్‌కుమార్ వంటి ఎన్నికల కమిషనర్లవలెనే. ఈ దోషం ప్రధానంగా కాంగ్రె స్, బీజేపీ అనబడే జాతీయ పార్టీలదే. వారు పాలనా వైఫల్యాలతో ప్రజాదరణ కోల్పోయి, అధికార పరిరక్షణ కోసం ఇలాంటి వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. అది అసలు రహస్యం.