Sonia Gandhi : వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ పుట్టూర్.. స్థానిక ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా వందేమాతరం గేయాన్ని సోనియా అవమానపరిచారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు. ఒకవేళ పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకుంటే కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు.
వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్ అవమానించి, చారిత్రకంగా తప్పు చేసిందని బీజేపీ నేత పుట్టూర్ అన్నారు. జాతీయ పతాకం ఎగరేసే సమయంలో వందేమాతరం ప్లే అవుతున్నప్పుడు సోనియా గాంధీ ఆటంక పరిచారని, గేయాన్ని అవమానించారని విమర్శించాడు. ఈ గేయాన్ని అవమానించిన వారి హోదాకు, స్థాయికి అతీతంగా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరినట్లు వివరించాడు. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా ఈ కేసుపై విచారణ జరపాలని పోలీసుల్ని కోరాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే, భారత న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, పుట్టూర్ స్పష్టం చేశాడు. మరోవైపు.. వందేమాతరం గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పుబట్టారు.
ఈ ఘటనను దేశ ప్రజలు కళ్లారా చూశారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సోనియా గాంధీ జాతీయ గేయాన్ని అవమానించారని షా విమర్శించారు. ఈ తప్పు చేసినందుకు సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జరిగిన వేడుకల సందర్భంగా వందేమాతరం ప్లే అవుతుండగా సోనియా గాంధీ ఏదో సైగ చేయడం, ఖర్గే స్పందించడం, సోనియా కాస్త అసహనం వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. దీంతో పూర్తిగా వందేమాతరం ప్లే అవ్వకుండా సోనియా గాంధీ అవమానించారు అనే ప్రచారం మొదలైంది. అయితే, ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని సోనియా కోరానని, అంతేతప్ప వందేమాతరం గేయాన్ని ఆమె అవమానించలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఈ అంశంపై దుమారం రేగుతోంది.