సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు.. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు.. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి.. అయితే విద్యాబోధనేమోగానీ ధరించే దుస్తులు సైతం వారికి అందడం లేదు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడస్తున్నా నగరంలోని చాలా పాఠశాలలకు స్కూల్ దుస్తులు అందలేదు. కొన్ని పాఠశాలల్లో ఒక్క జత దుస్తులు మాత్రమే అందాయి. వాటితోనే విద్యార్థులు నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. వచ్చిన దుస్తులు సైతం విద్యార్థులకు ఏ మాత్రం సరైన కుట్టుగా రాలేదు. దీంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందాల్సిన జత దుస్తులు కూడా కొన్ని స్కూల్లో ఇప్పటికీ అందలేదు.
పూర్తిస్థాయిలో విద్యార్థులకు యూనిఫాంలు అందకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉండి కూడా విద్యార్థులకు దుస్తులు అందని దుస్థితి పాఠశాలల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా మూడు నెలలు ఆలస్యంగా యూనిఫాంలు అందించారు. సాధారణంగా యూడైస్ లెక్కల ప్రకారం విద్యార్థులకు యూనిఫాంలు అందించడానికి అధికారులు ప్రణాళికలు చేసుకున్నారు. కానీ చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ యూడైస్‌లో వివరాలు నమోదు కాలేదు. అధికారులు క్లాతింగ్ ప్రక్రియను సకాలంలో మహిళా గ్రూపులకు అందించకపోవడంతో వాళ్లు విద్యార్థుల కొలతలు తీసుకోలేకపోయామని చెబుతున్నారు. దీంతో వాళ్లు ఊహాజనిత ఆధారంగా తరగతుల వారీగా దుస్తులు కుట్టేస్తున్నారు. 1,2,3 తరగతులకు ఒక సైజు అని, 4,5కు, 6,7కు, 8,9,10 తరతగతులకు ఓ సైజు అని దుస్తులను కుడుతున్నారు. కానీ అవి అత్యధిక మంది విద్యార్థులకు నచ్చడం లేదని టీచర్లు చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు యూనిఫాంలు అందించాలని కోరుతున్నారు.