ముంబై, సెప్టెంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ విజృంభిస్తున్న ముడి చమురు ధరలు.. మదుపర్లను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 105.4 డాలర్లకు చేరింది మరి. దీనికితోడు అమెరికా బాండ్లలో పెట్టుబడులపై రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బీమా పంపిణీ విధానంలో ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలతో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇంకా దిగజారడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,247.71 పాయింట్లు లేదా 1.67 శాతం క్షీణించి 73,580.54 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,264.33 పాయింట్లు పడిపోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 383.70 పాయింట్లు లేదా 1.64 శాతం పతనమై ఐదు నెలలకుపైగా కనిష్ఠాన్ని తాకుతూ 23,063.10 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లో కదలాడాయి. సమయం గడుస్తున్నకొద్దీ నష్ట తీవ్రత పెరుగుతూపోయింది.
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఫలితంగా రూ.480 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆర్థిక, బీమా, మెటల్, ఆటో, చమురు రంగాల షేర్లు పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ (5.47 శాతం), యాక్సిస్ బ్యాంక్ (4.67 శాతం), బజాజ్ ఫిన్సర్వ్ (4.06 శాతం) షేర్లు ఐఆర్డీఏఐ ప్రతిపాదన తర్వాత సెల్లింగ్ ప్రెషర్‌కు లోనయ్యాయి. వ్యయాల నిర్వహణ పరిమితుల్ని తగ్గించడం, కమీషన్లపై కఠినమైన నియంత్రణల్ని తీసుకురావడం వంటివి ఇన్వెస్టర్లకు రుచించలేదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండిగో, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లూ నిరాశపర్చాయి. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు, మెజారిటీ ఐరోపా మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి.
ఎన్ఎస్ఈ షేర్లు గురువారం బీఎస్ఈలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దాదాపు 2 శాతం లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోని టాప్-10 స్టాక్ ఎక్సేంజీల్లో ఎన్ఎస్ఈ 46.87 బిలియన్ డాలర్ల (రూ.4.49 లక్షల కోట్లు)తో 7వ స్థానంలో నిలిచింది. కాగా, ఉదయం రూ.1,800 వద్ద స్టాక్ లిస్టింగ్ జరిగింది. ఇష్యూ ధర రూ.1,785తో పోల్చితే 0.84 శాతం అధికం. ఇక ఒకానొక దశలో 5.21 శాతం పుంజుకున్న షేర్ వాల్యూ.. గరిష్ఠ స్థాయి రూ.1,878ని తాకింది. చివరకు 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద ముగిసింది. ఫలితంగా ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ రూ.4,49,955 కోట్లుగా నమోదైంది.
మార్కెట్ విలువ ప్రకారం బీఎస్ఈలో 11వ స్థానంలో ఉన్నది. రూ.16,49,616.47 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్ర స్థానంలో కొనసాగతున్నది. ఆ తర్వాత స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఎల్ఐసీ, హిందుస్థాన్ యునీలివర్ వరుసగా ఉన్నాయి. ఇటీవల రూ.22,569 కోట్ల పబ్లిక్ ఇష్యూతో వచ్చిన ఎన్ఎస్ఈ.. దేశీయంగా హ్యుందాయ్ (రూ.27,870 కోట్లు) తర్వాత రెండో అతిపెద్ద ఐపీవోగా ఉన్న విషయం తెలిసిందే.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరో 26 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 95.99 వద్ద ముగిసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు.. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ను తెచ్చిపెట్టాయని ఫారెక్స్ ట్రేడర్లు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నడుమ అమెరికా బాండ్ల రాబడులు పుంజుకోవడం కూడా ప్రభావితం చేసిందంటున్నారు.
