ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : కొత్తపేట మహిళా భవన్లో చైతన్యపురి పోలీస్‌స్టేషన్ తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారింది. మహిళా కార్యక్రమాలు నిర్వహించే మహిళా భవన్‌ను పోలీస్‌స్టేషన్‌కు కేటాయించడంపై మహిళలు, నాయకులు వ్యతిరేకించారు. ఒక వేళ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే ఎప్పటివరకు ఇక్కడి నుంచి తరలిస్తారో చెప్పాలంటూ వారు ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయ సేకరణతో మహిళా భవన్లో చైతన్యపురి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయలన్న లక్ష్యంతో గురువారం మహిళా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకించారు. మహిళల సాధికారత కోసం మహిళా భవనాన్ని నిర్మిస్తే ఇక్కడ పోలీస్ కార్యాలపాలకు కేటాయిస్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు.
పోలీస్‌స్టేషన్ ఏర్పాటు అంశంపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ వైఖరిని వెల్లడించారు. మహిళలు కూడా తమ భవనాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ను కొత్తపేట మహిళా భవనంలో ఏర్పాటు చేసేందుకు అధికారిక ఉత్తర్వులు అందడంతో ఈ భవనంలోని వార్డు కార్యాలయాన్ని తొలగించి పోలీస్‌లకు అప్పగించడంతో గురువారం నుంచి పనులు మొదలుపెట్టారు. దీంతో అన్ని పార్టీల నేతలు మహిళలు ఆందోళన చేస్తూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీకాంత్, చైతన్యపురి సీఐ సైదులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్,మహిళా ప్రతినిధులు రాధిక, విజయగౌడ్, బీఆర్ఎస్ నేతలు విజయ గౌడ్, లావణ్య, శోభా గౌడ్ పాల్గొన్నారు.