రాజకీయాల్లో గెలుపు అవసరం. కానీ గెలుపు కోసం మనుషులను అడ్డగోలుగా వాడుకొని, పని అయిపోయాక పక్కన పెట్టడం వ్యూహం కాదు – అది నైతిక పతనం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నాయకుడు అజహరుద్దీన్ పోటీ చేయకుండా ఆపడానికి, ముస్లిం ఓట్లకు గాలం వేయడానికి రేవంత్‌రెడ్డి హడావుడిగా మంత్రి పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ గెలువకపోతే ముస్లింలకు గౌరవమే లేదంటూ భయపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి గండం గట్టెక్కారు. ఇలా రేవంత్‌రెడ్డి వాడుకొని వదిలేసిన వారి జాబితా చూస్తే చాలా పెద్దగానే ఉన్నది. వాడుకోబడుతున్న వాళ్లు ఇప్పటికైనా మేల్కొంటే మంచిదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అజహుద్దీన్ రాష్ట్రంలో ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా సీఎం రేవంత్‌రెడ్డి.. అతడికి మంత్రి పదవి కట్టబెట్టి నాలుగు నెలలైంది. మరో రెండు నెలల్లో అజహరుద్దీన్ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో కాకపోతే ఆ మంత్రి పదవి హుష్ కాకి. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. మార్చి 31లోగా తీర్పు రాకపోతే అజహరుద్దీన్ మాజీ మంత్రి అయిపోతారు. ఇది రేవంత్‌రెడ్డి వ్యక్తిగత అపజయం మాత్రమే కాదు. వాడుకొని వదిలేసే రాజకీయానికి ఉదాహరణ.
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న లాబీయింగ్‌ను దిగ్విజయంగా ఎదుర్కొనేందుకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశారు. లోప్రొఫైల్‌లో ఉన్న తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అయిన ప్రొఫెసర్ కోదండరాంను చైర్మన్‌ను చేశారు. జేఏసీ తరఫున జరిగిన కార్యక్రమాలన్నీ తన నాయకత్వం వల్లనే జరిగాయని కోదండరామ్ ఊహించుకోవడం సహజమే, ఫర్వాలేదు. రాష్ట్ర ఏర్పాటుకు ముం దే ఉద్యమ కార్యాచరణకు భిన్నంగా కోదండరామ్ అడుగులు వేసినా కేసీఆర్ ఒక్క మాట కూడా అనలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. కానీ 2023 ఎన్నికలకు ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిని కోదండరామ్‌కు కాంగ్రెస్ పెద్దలు, రేవంత్‌రెడ్డి అప్పజెప్పారు. సీట్ల దగ్గరికి వచ్చేసరికి మొండిచెయ్యి చూపించారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత పాత గవర్నర్ ఆపిన ఎమ్మెల్సీ పదవిని అప్పజెప్పినా అదికాస్తా సుప్రీంకోర్టులో చిక్కుకున్నది.ఇప్పుడు కోదండరామ్ బిచ్చగాళ్లను కూడా ఏకం చేయగల నాయకుడంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు.మున్సిపల్ ఎన్నికల్లోనూ కోదండరామ్ పార్టీని రేవంత్ పట్టించుకోలేదు. కోదండరాంను ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నారు. అయితే తాను వాడుకోబడుతున్న సంగతి సారుకు అర్థమైతలేదు.
ప్రజా గాయకుడు గద్దర్‌ను కూడా రేవంత్ వాడుకొన్నారు. కనపడ్డ ప్రతీ మైకు ముందు లేని అభిమా నం ఒలకబోశారు. కానీ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఉద్యమంలోనే లేరు. ఉద్యమకారులపై తుపాకీ పట్టుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు గద్దర్ కన్నుమూశారు. గద్దర్ పాడెను రేవంత్‌రెడ్డి మోశారు. గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోవడంతో సాంస్కృతిక వారధి చైర్మన్ పదవి ఇచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు గద్దర్ విగ్రహం కోసం గొంగడి భుజాన వేసుకొని కూతురు తిరగాల్సిన దుస్థితి తలెత్తింది. చంద్రబాబు హయాంలోనే గద్దర్‌పై కాల్పులు జరిగిన ఉదంతంపై పలు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబునూ వెన్నెల ప్రాధేయపడాల్సిన దయనీయ స్థితి నెలకొన్నది.
జయజయహే తెలంగాణ గీతాన్ని స్టూడియోకు వెళ్లి దగ్గరుండి రికార్డ్ చేయించింది కేసీఆర్. ఉద్యమకాలంలో అందెశ్రీకి సన్మానం చేసింది కూడా కేసీఆరే. రాష్ట్ర గీతంగా చేసేందుకు వీలుగా ఆ గీతాన్ని రెండున్నర నిమిషాలకు కూర్పు చేయాలని కేసీఆర్ కోరినప్పుడు అందెశ్రీ తిరస్కరించారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఏ వేదికపై కూడా అందెశ్రీని అవమానించలేదు. కానీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి న తర్వాత ఇదే అంశాన్ని నెగెటివ్ ప్రచారంగా మార్చారు. అందెశ్రీని రెచ్చగొట్టారు. 2023 ఎన్నికల తర్వాత అదే రెండున్నర నిమిషాల నిడివికి అందెశ్రీ అంగీకరించారు. ఆఖరికి ట్యూ న్ మార్చడానికి కూడా ఒప్పుకున్నారు.
ఇదే అంగీకారం 2014లో జరిగి ఉంటే ఆ పాట పన్నెండేళ్లుగా రాష్ట్ర గీతంగా ఉండేది. దురదృష్టవశాత్తూ అందెశ్రీ కలల సౌధం అర్ధంతరంగా ముగిసింది. ఘట్కేసర్ దగ్గర స్మృతి వనం పనులు నాలుగు నెలలైనా మొదలుకాలేదు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి కొంత మంది తెలంగాణ మేధావులకు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నూరి పోశా రు. అప్పుడు ఆ మేధావులు బస్సు ల్లో ఊర్లు తిరుగుతూ కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు. అందరూ అతి ఉత్సాహంతో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారు. కానీ నిజం ఏమిటంటే.. సీఎం గద్దె ఎక్కేందుకు రేవంత్‌రెడ్డికి వాళ్లందరూ మెట్లు అయ్యారు. ఇప్పుడు వాళ్లకు అర్థమైంది ఏంటంటే.. వాళ్లను కూరలో కరివేపాకు కంటే దారుణంగా తీసి పక్కకు పడేశారని.
రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ తీర్థం తొలి మెట్టు. కాంగ్రెస్‌లో ఆయన శాశ్వతంగా ఉండలేరు. ఉన్నంతవరకు కాంగ్రెస్‌ను వాడుకొంటున్నారు. గద్దర్, అందెశ్రీ, కోదండరామ్, కొంద రు మేధావులు, నిరుద్యోగులు అందరూ ఒక్కో మెట్టు అయ్యారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఐదు రోజుల ట్రైనింగ్ తీసుకుంటే ఏమైనా జ్ఞానం రావాలి. బాధ్యత పెరగాలి. కానీ రేవంత్ మాత్రం అరకొరగా ఉన్న మతిని కూడా పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అంతర్జాతీయ సర్టిఫికెట్‌తోనే రాజకీయ సంస్కృతి రాదు. స్వతహాగా నైతిక విలువలు ఉండాలి. వా ళ్లు నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తా ను నా చేతుల్లో మోసపోవడానికే వాళ్లున్నారు అనే ది రేవంత్‌రెడ్డి నైజం. ఇప్పటికైనా మేధావులకు అర్థమైతే ప్రజలకు మంచి జరుగుతుంది. పూటకో రంగు మార్చే ఊసరవెల్లి రేవంత్‌రెడ్డి. తెలంగాణ సమాజం ఎవరికైనా మెట్టు కాదు. వాడుకొని వదిలేసే రాజకీయాలకు ఎప్పటికైనా ప్రజలే గుణపాఠం చెప్తారు.
(వ్యాసకర్త: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్