చేంజ్ మన చేతుల్లో.. మన చేతల్లో..
ఓ బద్ధకపు ఉదయం.. మంచం మీద నుంచి కదలాలనే లేదు. కానీ రేపే పరీక్ష. కాసేపట్లో మీటింగ్.. తను అనుకున్న ప్రణాళికను సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే జీవితమే మారిపోతుంది. కానీ, ఏం జరుగుతుందా? అనే ఆందోళనలో ఊపిరి కూడా ఆడనంత ఉద్వేగం.
ఓ బద్ధకపు ఉదయం.. మంచం మీద నుంచి కదలాలనే లేదు. కానీ రేపే పరీక్ష. కాసేపట్లో మీటింగ్.. తను అనుకున్న ప్రణాళికను సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే జీవితమే మారిపోతుంది. కానీ, ఏం జరుగుతుందా? అనే ఆందోళనలో ఊపిరి కూడా ఆడనంత ఉద్వేగం. ఓ పని చేస్తే తనకి ఇష్టం ఉండదని ఇంట్లోవాళ్లకి చాలాసార్లు చెప్పాడు. కానీ, ఇవాళ కూడా అదే జరిగింది. కోపం కట్టలు తెంచుకుంది. అది బయటికి వస్తే ఓ వారంపాటు నిశబ్ద యుద్ధం తప్పదు. లోపలే ఉంటే తననే దహించేస్తుంది. ఓ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని ఆమె సంకల్పం. కానీ, కంప్యూటర్ ఆన్ చేయగానే, మధ్యమధ్యలో వేరే వెబ్సైట్లలో మునిగిపోతూ ఉంటుంది. చెదిరిపోతున్న ఏకాగ్రతను కూడదీసుకోవడం చాలా కష్టంగా ఉంది.
రోజూ ఇలాంటి సవాలక్ష సందర్భాలు మనల్ని ఇబ్బందిపెడతాయి. ఆరోగ్యం దగ్గర్నుంచీ ఆందోళన వరకూ ఎన్నో అంశాల్లో మన చేతులు కాలుతుంటాయి. మారాలనుకుంటాం. ఎలా మారితే బాగుంటుందా? అని ప్రణాళికలు వేసుకుంటాం. అదేంటో.. మర్నాటికి అంతా మామూలే! ఎందుకంటే దీర్ఘకాలిక మార్పు
నిదానంగా, స్థిరంగా, భారంగా ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితాల్లో అంత ఎదురుచూసే సమయం ఉండకపోవచ్చు. అందుకే ఓవైపు వ్యక్తిత్వంలో సానుకూలమైన మార్పుకోసం ప్రయత్నిస్తూనే.. అప్పటికప్పుడు సాయపడే ఉపాయాల వైపూ చూస్తున్నారు. జీవితం ఒకప్పటిలా లేదు. హఠాత్తుగా పడక్కుర్చీ మీద నుంచి థ్రెడ్మిల్ మీదికి జారినట్టు… నిరంతరం పరుగులే. కాలం అదే! కానీ కొలమానం మాత్రం తగ్గిపోతున్నది. ఎదురుచూపుల ఓపిక గంటల నుంచి సెకన్లకి మారిపోయింది. అది రీల్స్ అయినా, నిర్ణయాలు తీసుకోవడం అయినా! ఇప్పుడంతా ఇన్స్టంట్ ఫలితాలు కావాల్సిందే. మరి మార్పు కావాలనుకుంటేనో! వాటికీ కొన్ని చిట్కాలు లేకపోలేదు.
బ్రాహ్మీ ముహూర్తమనీ, పొద్దున్నే లేచి చదువుకుంటే దేవతల ఆశీస్సులు ఉంటాయనీ.. మనల్ని పెద్దలు చాలానే మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. వాటి వెనుక ఉన్న శాస్త్రీయమైన కారణాలు తెలిసి కూడా చాదస్తం అని కొట్టిపారేశాం. కానీ, జీవితంలో తొలి మార్పు, క్రమశిక్షణకి తొలి సంకేతం ఉదయాన్నే నిద్రలేవడం అన్నది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ దాన్ని సాధించేదెలా!

రాకెట్ టెక్నిక్… ‘జీవితంలో గెలిచి తీరాలి అన్న ప్రేరణ (మోటివేషన్) పనిచేస్తే అందరూ కోటీశ్వరులు అయిపోతారు, అందరికీ సిక్స్ ప్యాక్ ఉంటుంది. అదంత తేలిక కాదు కాబట్టే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. ఉదయాన్నే మెలకువ రాగానే తిరిగి నిద్రలోకి జారకుండా మంచం మీద నుంచి దిగడానికి నేను 5 సెకన్ల పద్ధతి వాడతాను. రాకెట్‌ని లాంచ్ చేసేటప్పుడు 5,4,3,2,1 అంటూ కౌంట్‌డౌన్ చేశాక ఇక ఆ రాకెట్ ఆగదు కదా. మంచం మీద నుంచి లేవాలనుకున్నప్పుడు కూడా అలాగే కౌంట్‌డౌన్ చేసి కాలు కిందకి పెట్టేస్తాను’ అంటారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మెల్ రాబిన్స్. కేవలం బద్ధకానికే కాదు! ఆందోళన, ప్రతికూల భావనలు, సాకులని మనసులోంచి తోసిపారేయడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెబుతారు. ఇంకా…
- మొబైల్ దూరంగా ఉంచితే… దాని దగ్గరికి వెళ్లి అలారం మార్చేంత సమయంలో
మెలకువ వచ్చేస్తుంది. - మిగతా ఇంద్రియాలకి కూడా పనిచెప్పేస్తే మెదడు మళ్లీ నిద్రలోకి జారుకోదని చెబుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా… గాఢమైన వెలుగు వచ్చే బల్బ్, ఓ హుషారైన పాట, పొగలు కక్కే కాఫీలని ఆహ్వానిస్తే ఇక రోజు మొదలైపోతుంది.
- ఇకిగాయ్ టెక్నిక్. ఆ రోజు ఏ లక్ష్యం అయితే మనల్ని నిద్రలేచి పనిచేసేలా ఉరికిస్తుందో.. దాన్నే ఇకిగాయ్ అంటారు. కెరీర్ పరంగానో, బంధాల కోసమో, వ్యక్తిగతంగానో.. ప్రతిరోజూ అలాంటి ఓ లక్ష్యాన్ని ఊహించుకుంటే నిద్రమత్తు వీడిపోతుంది.
ఇంకా ఆ సమయంలో తప్పించుకోలేని పని పెట్టుకోవడం, క్రమంగా పావుగంట చొప్పున నిద్రలేచే సమయాన్ని వెనక్కి జరపడం, తెల్లవారేసరికే నిద్ర తీరిపోయేలాగా త్వరగా పడుకోవడం లాంటి చిట్కాలూ ఉన్నాయి. ఇవి కేవలం నిద్రకే కాదు.. ఆ రోజు బద్ధకంగా మొదలవకుండా ఉండటానికి, లక్ష్యానికీ-వ్యక్తిగత జీవితానికీ తగినంత సమయాన్ని కేటాయించడం కోసం కూడా ఉపయోగపడతాయి.

ముందే ఓడించే ఉద్వేగాలు
ఉదయాన్నే లేచినా, ప్రతి లక్ష్యానికీ సన్నద్ధంగా ఉన్నా.. ముందుగానే ఓటమిని గుర్తుచేసేది ఒత్తిడి. ఏం జరగబోతున్నదో? అని కంగారుపెట్టేది ఆందోళన. సమస్యల జాబితాని సిద్ధం చేసేది భయం. ఇలాంటి ప్రతికూలమైన ఉద్వేగాలకు చెక్ పెట్టడానికి చాలా మానసిక పరిణతి అవసరం. దానికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే జీవితకాలం లేటవుతుంది. అందుకని అప్పటికప్పుడు వీటిని దాటే Life Hacks కొన్ని ఉన్నాయి.
శ్వాసే కీలకం: అంతగా గమనించం కానీ.. మన ఉద్వేగాలకీ, చేస్తున్న పనికీ అనుగుణంగానే శ్వాసని పీల్చుకుంటూ ఉంటాం. కోపం లేదా ఆందోళనలో ఉన్నప్పుడు వేగంగా ఊపిరి పీల్చుకుంటాం. Fight or Flight (పోరాడాలా? పారిపోవాలా?) అనే సందిగ్ధాన్ని ఎదుర్కొనేందుకు శరీరం చేసిన ఏర్పాటు అది. దాన్ని సరిచేసుకుంటే ఉద్వేగం కూడా నెమ్మదిస్తుంది. వీటిలో చాలారకాలే ఉన్నాయి కానీ Box Breathing కాస్త ఎక్కువ ప్రచారంలో ఉంది. దీని ప్రకారం నాలుగు అంకెలు లెక్కపెడుతూ ఊపిరి పీల్చుకోవాలి, మరో నాలుగు లెక్కపెడుతూ దాన్ని పట్టి ఉంచాలి, ఇంకో నాలుగు లెక్కపెడుతూ ఆ శ్వాసని వదలాలి, ఆ తర్వాత శ్వాసను పీల్చుకునేందుకు మరో నాలుగు లెక్కపెట్టాలి. ఇలా ఓ నాలుగైదు వలయాలను పూర్తి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా శ్వాసలోనే 4-7-8 టెక్నిక్, బెల్లీ బ్రీతింగ్ లాంటి చిట్కాలు కూడా ఉన్నాయి.
- ఆందోళనగా ఉన్నప్పుడు కాసేపు నడవడం.. అది కూడా పచ్చదనం ఉన్నచోట నడిస్తే ఒత్తిడి తగ్గడంతో పాటుగా సమస్యకి ఉపాయం కూడా తడుతుంది.
- కోపం లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మెడ, భుజాలు, దవడ, ఛాతీ, పొట్ట భాగాల్లో ఉండే కండరాలు బిగుసుకుంటాయి. వాటి మీద దృష్టి సారించి కాస్త వదులుగా (loosen up) చేస్తే ఉద్వేగపు తీవ్రత చాలావరకు తగ్గుతుంది.
- ఆ సమయంలో మెదిలే ఆలోచనలను కాగితం మీద పెట్టడం కానీ, పైకే గట్టిగా అనుకోవడం కానీ, స్నేహితుడితో పంచుకోవడం కానీ చేస్తే అవి ఎంత అల్పమైనవో వ్యక్తపరిచేటప్పుడే తేలిపోతుంది.
- కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని తగ్గిస్తాయని సైన్సే చెబుతున్నది. డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ, చూయింగ్ గమ్, తేనె.. లాంటి పదార్థాలకి ఈ లక్షణం ఉందట.
ఇవే కాకుండా పెంపుడు జంతువులతో గడపడం, అంకెలు వెనక్కి లెక్కపెట్టడం, ఇష్టమైన ప్రదేశం లేదా ప్రకృతిని ఊహించుకోవడం, స్ట్రెస్ బాల్ వాడటం, మణికట్టు మీద చల్లటి నీళ్లు పారేలా చేయడం, ధ్యానం, సంగీతం వినడం, ఇష్టమైన కామెడీ సీన్స్ చూడటం, 54321 గ్రౌండింగ్ టెక్నిక్ లాంటి ఉపాయాలు అప్పటికప్పుడే ఒత్తిడి, కోపం, ఆందోళన, భయం లాంటి ప్రతికూలమైన భావాలను అదుపులో ఉంచుతాయి.

దృష్టి సారించలేకపోతే!
ఏం చేయాలి అన్న లక్ష్యం ఉంది. దాన్ని ఎలా చేయాలో ఓ స్పష్టత ఉంది. సిస్టం ముందు కూర్చున్నాం. చుట్టూ నిశ్శబ్దం. పని చేయడానికి ఇంతకంటే అనుకూలమైన వాతా వరణం ఏముంటుంది? కానీ, చాలామందికి ఏకాగ్రత సమస్య ఉంటుంది. దాంతో సమయం వృథా అయిపోతుంటుంది. ఏం చేయలేకపోతున్నాం అనే పశ్చాత్తాపం మొదలవుతుంది. ఈ విషవలయానికి కారణం అసమర్థతే అని చాలామంది అనుకుంటారు. నిజానికి ADHD, ACE, న్యూరాసిస్.. లాంటి సవాలక్ష కారణాలు ఉంటాయి. అందుకని ఏకాగ్రత లోపిస్తున్నప్పుడు, దృష్టి పెట్టలేక పోతున్నప్పుడు కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.
పొమొడొరో: అప్పటికప్పుడు పని మీద శ్రద్ధ ఉంచడానికి వాడే ఉపాయాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చే టెక్నిక్. ఓ 25 నిమిషాల పని, ఆ తర్వాత 5 నుంచి 10 నిమిషాల బ్రేక్. ఇలా ఓ నాలుగు వలయాలు పూర్తయిన తర్వాత కాస్త సుదీర్ఘమైన విరామం. ఇదే పొమొడొరో టెక్నిక్. మరీ ఎక్కువసేపు, అలాగని మరీ స్వల్ప
వ్యవధి కాకుండా ఓ పనిని ఏకాగ్రత పట్టి ఉంచేందుకు తగినంత సమయం ఉంచడమే దీని రహస్యం. దీనికోసం ప్రత్యేకమైన పరికరాలూ ఉన్నాయి. అవి కొనడం ఎందుకు అనుకుంటే ఆన్లైన్లో నడిచే పొమొడొరో వెబ్సైట్లు ఉన్నాయి.
- Declutter చిట్కా! డెస్క్ మీద రక రకాల సామాన్లు పరుచుకుని ఉంటే వాటిని తీసిపారేయండి. ఏవన్నా శబ్దాలు వినిపిస్తుంటే వాటిని అడ్డుకోవడానికి ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి. ఆ కాసేపు ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టేయండి. కంప్యూటర్లో మిగతా విండోస్ క్లోజ్ చేయండి. మెదడు దిక్కులు చూడకుండా చేసే ప్రయత్నమిది.
- 2 మినిట్ రూల్. ఓ మెయిల్‌కి జవాబు ఇవ్వాలి, ఒకరికి కాల్ చేయాలి, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, పని పురమాయించాలి.. వీటికి రెండు నిమిషాలకు మించి పట్టదు. కానీ రోజులు, ఒక్కోసారి నెలల తరబడి వాయిదా వేస్తుంటాం. అందుకే రెండు నిమిషాల లోపు చేయగలిగే పనులను చటుక్కున చేసేస్తే పని జరగడంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని డేవిడ్ అలన్ అనే రచయిత సూచిస్తారు.
- ఓ పెద్ద పుస్తకం చదవాలి, ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి, ఓ నవల రాయాలి… ఇలాంటి లక్ష్యాలన్నీ రకరకాల భయాలతో మొదలు పెట్టకుండానే ఉండిపోతాయి. కానీ ఒకసారి మొదలుపెడితే దాన్ని పూర్తిచేయాలనే పట్టుదల వస్తుంది. అందుకే ముందు పనిని మొదలుపెట్టి చూడండి అంటుంది అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం, ఏదన్నా పనిని కనీసం 5 నిమిషాల పాటు పట్టుకుని ఆ తర్వాత కొనసాగించాలో వద్దో చూసుకోండి అంటుంది 5 మినిట్ రూల్. వీటితో పాటు 3-3-3, 80:20 లాంటి చాలా టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉంటే తెలుసుకుని పాటించవచ్చు. ఇవన్నీ మంచి ఫలితాలనిచ్చేవే!
బంధమే బలం!
వ్యక్తిగతంగా ఎదగడం ఎంత అవసరమో… నలుగురిలో కలవడం, అందరినీ కలుపుకొంటూ వెళ్లడం కూడా అంతే అవసరం. కుటుంబం, మిత్రులు, పొరుగు, సహోద్యోగులు, క్లయింట్స్, కస్టమర్స్… ఎవరితో అంటీముట్టనట్టు ఉన్నా జీవితం అసంపూర్తిగా మారిపోతుంది.
గెలిచే మార్గం: మనస్ఫూర్తిగా చిరునవ్వుతో పలకరించడం, ఇష్టాలని గుర్తుంచుకోవడం, అభిరుచుల గురించి మాట్లాడటం, అవతలివారు చెప్పింది ఆసక్తిగా వినడం, తరచూ పేరుతో పిలవడం, బలహీనతలను ఎత్తిచూపకపోవడం, వాదనలోకి దిగకపోవడం.. లాంటి మౌలికమైన విషయాలు ఏ బంధంలో అయినా అవసరమే. వీటిని పాటించడానికి అంత సమయం కూడా పట్టదు. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చెప్పారు కాబట్టే డేల్ కార్నిగె రాసిన ‘How to Win Friends and Influence People’ ఈ రంగంలో అత్యుత్తమ పుస్తకంగా నిలిచిపోయింది.
- ఒంటరిగా ఉన్నా, మందిలో కూర్చున్నా, ఫంక్షన్లో ఉన్నా, ఆఖరికి ఇంట్లో సోఫాలో కూర్చున్నా… అంతా చేసే పని మొబైల్ చూడటమే. ఇప్పుడంతా మైక్రో కాన్వర్జేషన్స్ని మర్చిపోతున్నారు. ఎలా ఉన్నారనే పలకరింపు, ఏం చేస్తున్నారనే ఆరా, ఏంటలా చిక్కిపోయారనే పరామర్శ.. ఇప్పుడు కరువైపోయాయి. హోటల్ వెయిటర్ దగ్గర్నుంచీ పాత మిత్రుడి వరకూ నేరుగానో, సందేశంతోనో పంచే సంభాషణ మన లోకాన్ని సందడిగా మార్చేస్తుంది. దానికి ఖర్చేం లేదు. పెద్దగా సమయమూ పట్టదు. కానీ బంధాలకు అవి ఫెవిక్విక్‌లా పనిచేస్తాయి.
- చాలామంది సంభాషణని కొనసాగించడం అంటే అదేపనిగా ప్రశ్నలు అడగడం అనుకుంటారు. నిజానికి ఓ మూడు ప్రశ్నల తర్వాత అవతలి వ్యక్తి విసిగిపోతాడు. అందుకే ఓ వాక్యాన్ని ప్రశ్నగా కాకుండా తను ఉద్వేగంగా చెప్పే అవకాశంగా మార్చగలగాలి. ‘అయితే నువ్వు హైదరాబాదులో ఉంటావా?’ అన్న ప్రశ్నకి ‘అవును’ జవాబుతో ఆగిపోతుంది. అదే ‘హైదరాబాద్ లైఫ్ చాలా బాగుంటుందంట కదా!’ అనే ప్రశ్న ఓ ఆసక్తికరమైన చర్చకి దారితీస్తుంది. దీన్నే open ended లేదా tell me more టెక్నిక్‌గా చెబుతారు.
- స్పష్టంగా మాట్లాడటం, తనవైపు తిరిగి మాట్లాడటం, నేల చూపులు చూడకపోవడం, చేతులు కట్టుకోకుండా ఉండటం, మాట్లాడేటప్పుడు తల ఊపడం.. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ బంధం పట్ల నిజాయితీని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే 90 శాతానికి పైగా కమ్యూనికేషన్ మన చేతల ద్వారానే బదిలీ అవుతుందని చెబుతారు నిపుణులు.
- టాపిక్ ఒకటే అయితే సంభాషణ కూడా పరిమితంగానే సాగుతుంది. ప్రయాణం నుంచి ఆహారం, ఆహారం నుంచి ఆరోగ్యం.. ఇలా క్రమంగా గేర్ మారుస్తూ ఉంటేనే సంభాషణల బండి ముందుకు సాగుతుంది.
అన్నింటికంటే పెద్ద ఉపాయం, మరీ ముఖ్యంగా కుటుంబ బంధాలలో ఫోన్ వాడకాన్ని తగ్గించడం. తినేటప్పుడు, కలిసి ప్రయాణించేటప్పుడు, ఆఖరికి నిద్రపోయే ముందు.. కలిసి ఉన్నా కూడా విడివిడిగా ఏదో ఒక తెరకి అతుక్కుపోవడం. సిగరెట్ మానేసిన వెంటనే ఆరోగ్యం మెరుగవడం మొదలైనట్టు.. స్క్రీన్లని పక్కన పెట్టిన వెంటనే ఇన్‌స్టంట్‌గా బంధాలు బలపడతాయి.
డబ్బు దాయాల్సిందే!

డబ్బు సంపాదించడం ఓ కళ, పెట్టుబడి పెట్టడమూ ఓ కళే. కానీ ఉన్న డబ్బుని పొదుపు చేయడం అంటే.. పోగేయడంతోనే సమానం. మనకి తెలియకుండానే జారిపోయే నోట్లని ఎలా ఒడిసి పట్టుకోవాలో చెప్పేందుకు చాలా చిట్కాలే ఉన్నాయి.
నోట్లలో చెల్లింపు చేసినప్పుడు తెలియకుండానే ఓ బాధ ఉంటుందట (pain of paying). యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ అందుబాటులోకి వచ్చాక బ్యాంక్ నిల్వలు కరిగిపోయేదాకా లోటు తెలియదు. అందుకే ఇలాంటి పద్ధతులలో చెల్లింపు చేస్తే మన ఖర్చు 12-18 శాతానికి పెరిగిపోతుందని ఓ అంచనా. అందుకని కాస్త ఓపిక చేసుకుని డబ్బు డ్రా చేసుకుని, వీలైనంతగా వాటినే వాడే ప్రయత్నం చేయాలి.
మార్కెట్లో సవాలక్ష వస్తువులు ఆకర్షిస్తుంటాయి, ఆన్లైన్ ఆశలు సరేసరి. ఇప్పటికిప్పుడు ఉపయోగం లేవు అనుకునే వస్తువులు కొనాలి అనుకుంటే కనీసం 24-48 గంటలు ఆగాలని చెబుతారు. ఈ ఉపాయం పాటిస్తే.. దానిపట్ల ఆకర్షణ కరిగిపోతుంది. అదే ఖరీదైన వస్తువులకైతే కనీసం వారం పాటు ఆగి నిర్ణయించుకోవాలట.
ఎలాగూ అందరికీ కనీసం రెండు అకౌంట్లు ఉంటున్నాయి కాబట్టి.. పొదుపు చేయాలి అనుకున్న మొత్తాన్నీ సదరు అకౌంటుకి బదిలీ చేసి.. ఉన్నదాంతోనే ఖర్చులు నెట్టుకొచ్చే ప్రయత్నం చేయాలి.
సంపాదన పెరగగానే అసంకల్పితంగా ఖర్చుపెట్టే తీరూ పెరిగిపోతున్నది. ఎందుకంటే మన దృష్టిలో డబ్బు విలువ మారుతుంది. దీన్నే Lifestyle Inflation అంటారు. దీన్ని అదుపులో ఉంచుకోవాలి.
బ్రాండెడ్ బదులు జెనరిక్ ఉత్పత్తులు వాడటం, ఆటో రెన్యువల్ అవుతున్న సబ్స్క్రిప్షన్లను గమనించుకోవడం, ఏ రోజుకారోజు ఖర్చులు రాయడం, కావాల్సిన సరుకుల జాబితా రాసుకుని దాంతోనే మాల్‌లోకి అడుగుపెట్టడం, బయట తిండి తగ్గించడం.. లాంటి చిట్కాలతో డబ్బుని పొదుపు చేయవచ్చు.
కేవలం ఆరోగ్యం, ఆదాయం, ఏకాగ్రత లాంటి విషయాలే కాదు.. చదివింది గుర్తుంచుకోవడం దగ్గర్నుంచీ కరెంట్ ఆదా చేయడం వరకూ వందలాది టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు తారసపడేవి, కాస్త విచక్షణతో ఉన్నవి పాటించి చూస్తే నష్టమేం లేదు.
ఆరోగ్యమే మహాభాగ్యం!

ఒక్క క్షణం ఆగి మనం ఊపిరి ఎంతవరకు పీల్చుకుంటున్నామో గమనిస్తే చాలు, ఆరోగ్యానికి సంబంధించి మన ప్రతి చర్యా ఎంత అపసవ్యంగా ఉందో తేలిపోతుంది. నూటికి 90 శాతం మంది వేగంగా, అర్ధంతరంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి సరిదిద్దుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయి.
- రోజు మొత్తమ్మీదా ఓ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని ఎలాగూ చెబుతారు. వాటిని కొంతవరకు మర్చిపోతాం కానీ.. పొద్దున లేవగానే ఒకటి రెండు గ్లాసుల నీళ్లు మాత్రం ఇన్స్టంట్ ఆరోగ్యాన్నిస్తాయి. రాత్రి తెలియకుండా డీహైడ్రేట్ అయిన శరీరానికి కావాల్సిన నీరు లభిస్తుంది. పేగులని శుభ్రం చేయడానికి, మెటబాలిజం వేగం పెంచడానికి సాయపడుతుంది. ఈ చిన్న పనితో మెదడు కూడా బద్ధకాన్ని వదిలించుకుని చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. కుదిరితే ఆ తర్వాత ఓ 5-10 నిమిషాల పాటు నీరెండలో నడవమని కూడా సూచిస్తున్నారు. దాని వల్ల జీవగడియారం గాడిలో పడుతుంది, విటమిన్ డి లభిస్తుంది.
- మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే ఓ పది, పదిహేను నిమిషాల నడక రక్తంలో ఒక్కసారిగా పెరిగిన గ్లూకోజ్ స్థాయులను సరిచేస్తుంది. కడుపు ఉబ్బరం, పని చిరాకుల నుంచి ఉపశమనం దక్కుతుంది. అదీ కుదరకపోతే కాఫ్ రైజెస్ (soleus push-ups) అనే కొత్త ట్రెండ్ నడుస్తున్నది. కూర్చున్నప్పుడు, మరీ ముఖ్యంగా తిన్న తర్వాత మునివేళ్లను నేలకానించి మడమలను మాత్రమే పైకెత్తడం ఈ వ్యాయామం. మొదట్లో ఓ రెండు నిమిషాల వరకు చేసి క్రమంగా 5-10 నిమిషాల వరకు చేయడం వల్ల కండరాలు బలపడతాయని, రక్తప్రసరణ మెరుగుపడుతుందని, చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని చెబుతున్నారు.
- 1:1 అరగంట కూర్చుంటే, మరో అరగంట నిలబడి పనిచేసుకోవడం.. ఇది ఉత్తమం, 2:1 ప్రతి నలభై నిమిషాలకీ ఇరవై నిమిషాలు నిలబడటం.. ఇది మధ్యస్థం, 3:1 ముప్పావుగంట కూర్చుంటే పావుగంట నిలబడటం.. ఇది కనీసం. కూలబడి పనిచేసేవారికి నిపుణులు సూచిస్తున్న పద్ధతిది. ఇవేవీ కుదరకపోయినా రెండు చిట్కాలు మాత్రం పాటించాల్సిందే. కనీసం అరగంటకి ఓసారి లేచి నిలబడి అటూఇటూ నాలుగు అడుగులు వేయడం.
- 20-20-20 నిరంతరం తెర ముందు పని చేసుకునేవాళ్లు ప్రతి 20 నిమిషాలకి ఓసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకన్ల పాటు చూడటం వల్ల రెటీనా మీద ఒత్తిడి తగ్గి, కంటి కండరాలకి వ్యాయామంలా పనిచేస్తుంది.
మునగాకు, జామకాయ లాంటి చవకైన సూపర్ ఫుడ్స్ తీసుకోవడం; ప్రతి అనారోగ్యకరమైన ఆహారానికి బదులు పోషకాలుండే పదార్థం తీసుకోవడం; నడిచే ఏ అవకాశాన్నీ వదలకపోవడం (ఉదా: లిఫ్ట్ బదులు మెట్లు), ప్రొటీన్ ఆహారంతో ఉదయాన్ని ప్రారంభించడం.. లాంటి అనేక చిట్కాలు క్రమంగా మన ఆరోగ్యాన్ని మెరుగ్గా మార్చేస్తాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

