ఒలింపిక్స్; కామన్వెల్త్ గేమ్స్; ఆసియా గేమ్స్; నేషనల్ గేమ్స్.. అందరికీ తెలిసిన క్రీడా పోటీలు! వాటికి ఏమాత్రం తీసిపోనివి.. ‘కిలా రాయ్‌పూర్-రూరల్ ఒలింపిక్స్’. పంజాబ్‌లోని ఓ పల్లెలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయివి. పంజాబీల శారీరక దృఢత్వంతోపాటు వారి సంస్కృతినీ దశదిశలా చాటుతున్నాయి. ముఖ్యంగా.. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహంతోపాటు అంతులేని ఉత్సాహాన్నీ అందిస్తున్నాయి.
1933లో ఇందర్‌సింగ్ గ్రేవాల్ అనే క్రీడాభిమాని.. ఈ క్రీడోత్సవాలను ప్రారంభించాడు. గ్రామీణ రైతులు, యువతలో శారీరక దృఢత్వాన్ని, సహకారాన్ని పెంపొందించడానికి ఈ వేడుకను ఏటా నిర్వహించాడు. మొదట్లో చుట్టు పక్కల గ్రామాల రైతులే పాల్గొనేవారు. ఆ తర్వాత పంజాబ్ నలుమూలల నుంచి ఎంతోమంది రైతులు, యువకులు ఇందులో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో స్థిరపడ్డ పంజాబీలు.. ఈ క్రీడోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన రూరల్ ఒలింపిక్స్‌లో ఎన్నో ప్రత్యేకలు కనిపిస్తాయి. పల్లె నుంచి ప్రపంచ స్థాయికి చేరుకున్న ఈ గ్రామీణ క్రీడోత్సవాల్లో 4,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించడానికి 10 లక్షల మందికిపైగా ఈ పల్లెకు తరలివస్తారు. ఇక టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసేవారు కోట్లల్లోనే ఉంటారు. ఏటా జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఖిలా రాయ్‌పూర్‌లో రూరల్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారు. క్రీడాంశాలను బట్టి.. మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతాయి. క్రీడల నిర్వహణ కోసమే గ్రామంలో ప్రత్యేకంగా ‘గ్రేవాల్ స్పోర్ట్స్ స్టేడియం’ నిర్మించారు. స్థానిక యువత.. తమకు నచ్చిన క్రీడాంశంలో ఇక్కడ క్రమం తప్పకుండా శిక్షణ పొందుతారు. ఈ గ్రామం నుంచి పంజాబ్ హాకీ జట్టుతోపాటు, అథ్లెటిక్స్‌కు ఎంతోమంది క్రీడాకారులు ఎంపికయ్యారు.

ఆటలతోపాటు పంజాబ్ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో పంజాబ్ జానపద నృత్యాలైన భాంగ్రా, గిద్దా, సంప్రదాయ సంగీత కచేరీలు ఆహుతులను కట్టిపడేస్తాయి. ఇక ఈ ఉత్సవాలను కవర్ చేయడానికి బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతోపాటు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు, ఫొటోగ్రాఫర్లు తరలివస్తారు.
కిలా రాయ్‌పూర్ రూరల్ ఒలింపిక్స్‌లో పంజాబీ సంప్రదాయ గ్రామీణ క్రీడలతోపాటు అసాధారణ శారీరక సాహసకృత్యాలను ప్రదర్శిస్తారు. ప్రత్యేకంగా ట్రాక్టర్ రేసులు, గుర్రపు స్వారీ, పంజాబ్ సంప్రదాయ మార్షల్ ఆర్ట్ గట్కా, పళ్లతో వాహనాలు లాగడం, సైకిళ్లపై రకరకాల విన్యాసాలు చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కబడ్డీ, కుస్తీ, పరుగు పందేలు, హాకీ లాంటి సంప్రదాయ క్రీడల్నీ నిర్వహిస్తారు. వీటితోపాటు ఎద్దులు, ఒంటెల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. అన్నిటికన్నా ప్రత్యేకంగా ఇక్కడ వయోధికుల పోటీలు జరుగుతాయి. 80 ఏండ్లు దాటిన వృద్ధులకు ప్రత్యేక పరుగు పందేలు నిర్వహిస్తారు. ఈ పోటీలు యువతరంలో స్ఫూర్తిని నింపుతాయి.

Kila Raipoor
జిల్లా కేంద్రమైన లూధియానా నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. కిలా రాయ్‌పూర్ చేరుకోవచ్చు. ఈ గ్రామంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. పంజాబ్‌లోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.