– మహిళా కార్పొరేటర్‌కు గాయాలు
– మాజీ మంత్రి వనమా, మాజీ ఎమ్మెల్యే మెచ్చా, బీఆర్ఎస్ నాయకులు దిండిగల, కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులతో కలిసి ఎంపీ వద్దిరాజు కేటీపీఎస్ సందర్శన
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 : బొగ్గు సరఫరా లేక విద్యుత్ ప్లాంట్లు వెలవెలబోతున్నాయంటూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్రావు బృందం గురువారం పాల్వంచ కేటీపీఎస్ సందర్శనకు వెళ్లింది. ఈ సందర్శనలో గేటు వద్దనే బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సుమారు గంటసేపు తోపులాట జరిగింది. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో కేవలం బృందంలోని ఐదుగురిని మాత్రమే ప్లాంట్‌లోకి అనుమతించారు. అనంతరం గేటు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు మాట్లాడారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నదన్నారు. రైతాంగం నిర్వేదంతో, బాధల్లో ఉన్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయానికి సాగునీళ్లు, విత్తనాలు, కరెంట్,యూరియా సక్రమంగా సరఫరా చేయకుండా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక బంగారుమయంగా తీర్చిదిద్దారని, తీవ్ర నష్టాలలో సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించారని ఎంపీ కొనియాడారు. థర్మల్ పవర్ స్టేషన్లు సింగరేణి సంస్థకు సుమారు రూ.55 వేల కోట్లు బకాయి పడ్డాయని, నాణ్యమైన 9, 10 జీ బొగ్గు సరఫరా లేక, మిషనరీ కూడా పాతబడిపోవడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయిందని అధికారులు చెప్పారన్నారు. నాణ్యమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రకు సరఫరా చేస్తూ విద్యుత్ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడి కేటీపీఏస్, బీటీపీఏస్ లను ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో విద్యుదుత్పత్తి 7 వేల నుండి 20 వేల మెగావాట్లకు పెంచి చూపి విమర్శకుల నోళ్లు మూయించారన్నారు.

కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
కేసీఆర్ పాలనలో సాగునీళ్లు, విద్యుత్, విత్తనాలు, యూరియా, రైతుబంధు పెట్టుబడి అందడంతో పంటలు సమృద్ధిగా పండడం, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడంతో రైతన్నలు, ప్రజలు సంతోషంగా జీవించారన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలన్నీ తీరుతాయని ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతామహాలక్ష్మీ, వేల్పుల దామోదర్, గోవాడ గుణచరిత్, బత్తుల మధుచంద్, సింధూ తపస్వి, మల్లెల రవిచంద్ర, రాజు గౌడ్, లావుడ్య సత్యనారాయణ, చింతలపూడి జగన్, బండారు రుక్మేందర్, అనుదీప్, నవతన్, భూపతి శ్రీనివాసరావు, అన్వర్, సంగు రాజేష్ పాల్గొన్నారు.