సోషల్ మీడియా అంటేనే ఓ రంగుల లోకం! ముఖ్యంగా టీనేజర్లకు స్నాప్‌చాట్ పేరు చెబితే ఆ క్రేజే వేరు! అయితే ఈ రంగుల లోకంలో మాయగాళ్లు, సైబర్ నేరగాళ్లు కూడా నిత్యం పొంచి ఉంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అని కంగారుపడే తల్లిదండ్రుల కోసం.. స్నాప్‌చాట్ ఇప్పుడు పటిష్ఠమైన రక్షణ కవచాన్ని సిద్ధం చేసింది. తన ‘ఫ్యామిలీ సెంటర్’ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేస్తూ, పిల్లల ప్రైవసీకి భంగం కలగకుండానే వారి భద్రతను పర్యవేక్షించే వీలు కల్పించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సేఫ్టీ ఫీచర్‌ని ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో అటు పిల్లలు, ఇటు పెద్దలు.. బ్యాలెన్స్డ్గా స్నాప్‌చాట్‌ని వాడుకోవచ్చు. ఎందుకంటే పిల్లల భద్రత ఎంత ముఖ్యమో, వారి ప్రైవసీ కూడా అంతే ముఖ్యం! అందుకే స్నాప్‌చాట్ ఇక్కడ ఓ మధ్య మార్గాన్ని ఎంచుకుంది.
ఈ ఫీచర్‌తో ఏం చేయొచ్చంటే.. గత వారం రోజుల్లో పిల్లలు ఎవరితో ఎక్కువగా చాటింగ్ చేశారు? ఎవరితో తరచుగా టచ్‌లో ఉన్నారు? అనే వివరాలను ఇప్పుడు పెద్దవాళ్లు చూడవచ్చు. అయితే, వారు ఏం మాట్లాడుకున్నారో.. ఆ మెసేజ్‌లలో ఏముందో మాత్రం చూడలేరు. కేవలం కమ్యూనికేషన్ ఎవరితో జరుగుతుందో మాత్రమే తెలుస్తుంది. దీనివల్ల పిల్లల వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది కలగదు, అదే సమయంలో అపరిచితులతో పరిచయాలు ఏర్పడుతుంటే తల్లిదండ్రులు ముందే అప్రమత్తం కావచ్చు. దీంతోపాటు పిల్లలు తమ లైవ్ లొకేషన్‌ను ఏయే స్నేహితులతో షేర్ చేస్తున్నారో తల్లిదండ్రులు చెక్ చేయవచ్చు. ఇది రియల్ టైమ్ ట్రాకింగ్ కాకపోయినా, లొకేషన్ షేరింగ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
తద్వారా ఆన్లైన్లో ప్రైవసీని ఎలా కాపాడుకోవాలో పిల్లలకు వివరించడానికి తల్లిదండ్రులకు అవకాశం లభిస్తుంది. ఎందుకంటే.. ఆన్లైన్ భద్రత అనేది కేవలం టెక్నాలజీతోనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఆరోగ్యకరమైన చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా స్నాప్‌చాట్‌లో ఏదైనా అసాధారణమైన లేదా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు తల్లిదండ్రులకు ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్స్ అందేలా ఫీచర్‌ని సెట్ చేశారు. ఈ ఫీచర్లను వాడాలంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తమ అకౌంట్లను ‘ఫ్యామిలీ సెంటర్’ నుంచి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. హానికరమైన కంటెంట్ ప్రభావం తగ్గించి, అపరిచితులతో అనవసర ఇంటరాక్షన్లను నియంత్రించే దిశగా స్నాప్‌చాట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టెక్ నిపుణులు స్వాగతిస్తున్నారు. అయితే టెక్నాలజీ ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నా, తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణే పిల్లలకు అసలైన శ్రీరామరక్ష.