వింటర్ వెళ్లిపోతూ, సమ్మర్ స్టార్ట్ అవుతున్న ఈ సంధికాలంలో.. వాతావరణం కాస్త విభిన్నంగా ఉంటుంది. చల్లిని ఈదురు గాలులు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖంలోని తేమను మొత్తం లాగేస్తాయి. ఇలాంటి సమయంలో ‘ఫేస్ ఆయిల్స్’ను ఆశ్రయించాలని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, చాలామంది కార్పొరేట్ సంస్థలు తయారుచేసే ఆయిల్స్వైపే చూస్తుంటారు. అలా కాకుండా ఇక్కడి వేడి, తేమ, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. మన భారతీయుల చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ఆయిల్స్‌ను ఎంచుకుంటే మంచిదని చెబుతున్నారు.
కుంకుమాది తైలం.. భారతీయ ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూనె. ఇందులో ప్రధానంగా కుంకుమపువ్వు ఉంటుంది. చర్మంపై నల్లటి మచ్చలను తగ్గించడంతోపాటు ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముఖానికి ఆయిల్ రాసుకోవడానికి భయపడతారు. కానీ, జోజోబా ఆయిల్ చర్మం సహజంగా ఉత్పత్తి చేసే ‘సెబమ్’ను పోలి ఉంటుంది. ఇది చర్మంలోని జిడ్డును సమతుల్యం చేస్తుంది. జిడ్డు చర్మం, మొటిమలు ఎక్కువగా వచ్చేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
రోజ్‌హిప్ ఆయిల్ యాంటి ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, సి.. ముడతలను తగ్గించడంలో ముందుంటాయి. సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. 30 ఏళ్లు పైబడిన వారికి మంచి ఎంపిక.
ఇక సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే.. స్క్వాలీన్ ఆయిల్ ప్రయత్నించొచ్చు. ఇది చాలా తేలికగా ఉండి, చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.