Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మెగా ప్రాజెక్ట్ వారణాసిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాయిదా ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా ప్రకటించిన తేదీకే విడుదల కానుందని చిత్ర యూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వారణాసి’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ముగ్గురు స్టార్ల కలయికతో పాటు రాజమౌళి దర్శకత్వం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, విస్తృత స్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా విడుదల తేదీ మారొచ్చని ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అలాంటి పరిస్థితి ఏదీ లేదని, సినిమా ముందుగా ప్రకటించినట్లుగానే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే కీలక షెడ్యూళ్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చిత్రబృందం పని చేస్తోందని తెలుస్తోంది.
‘వారణాసి’ విడుదలకు ఇంకా 250 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రాజమౌళి ప్రతి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించే తీరు, మహేష్ బాబు తొలిసారి ఆయన దర్శకత్వంలో నటిస్తుండటం, ప్రియాంక చోప్రా రీఎంట్రీ వంటి అంశాలు ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీపై స్పష్టత రావడంతో ఇకపై చిత్రబృందం నుంచి టీజర్, పోస్టర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వరుస అప్డేట్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, ‘వారణాసి’ వాయిదా పడుతుందన్న ప్రచారాలకు తెరపడగా.. 2027 ఏప్రిల్ 7న రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.