న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణించిన ఆరేళ్ల చిన్నారి టాయిలెట్‌కు వెళ్లడం, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. కాక్‌పిట్‌లో రక్తసిక్తంగా పడి ఉన్న భారత కెప్టెన్ స్మిత్ పరిస్థితిని గమనించిన ఆ బాలిక తన తండ్రిని అలెర్ట్ చేసి ఎంతో సహాయం చేసింది. (flydubai flight) సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన విమానం 174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. ఆ విమానం 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ హైజాకింగ్ ప్రయత్నం చేశాడు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఎక్కువ మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు ఉన్న ఆ విమానాన్ని కూల్చివేసేందుకు అతడు ప్రయత్నించాడు.
కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆరేళ్ల నీనా తన తండ్రితో కలిసి ఆ విమానంలో ప్రయాణించింది. కాక్‌పిట్‌లో దాడి జరుగుతున్న సమయంలో ఆ బాలిక టాయిలెట్‌కు వెళ్లింది. కాక్‌పిట్ నుండి అరుపులు వినిపించడంతో ఆ చిన్నారి ఆందోళన చెందింది. టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన ఆ బాలిక, కత్తిపోట్లతో రక్తసిక్తమైన భారత పైలట్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ నుంచి తూలుతూ బయటకు రావడాన్ని చూసింది. కత్తితో దాడి చేసిన ఒమన్ కో-పైలట్‌తో ఆయన పెనుగులాడటం చూసి ఆ చిన్నారి భయాందోళన చెందింది. ఆ బాలిక గట్టిగా పిలువడంతో ముందు వరుసులో కూర్చొన్న ఆమె తండ్రి పరుగున అక్కడకు వెళ్లాడు. ‘నాన్నా, మనం చనిపోవాలనుకోవడం లేదు’ అని ఆమె అన్నది.
మరోవైపు ఇది విన్న ఆ వ్యక్తి వెంటనే స్పందించాడు. వేగంగా కాక్‌పిట్ వైపు వెళ్లాడు. అక్కడి పరిస్థితి చూసి ఇతర ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో మరో ఇద్దరు ప్రయాణికులైన అసఫ్ రాజువాన్, యానివ్ హయూన్ వెంటనే కాక్‌పిట్ వద్దకు చేరుకున్నారు. భారత పైలట్ స్మిత్‌పై కత్తితో దాడి చేసిన కో పైలట్‌ను అడ్డుకున్నారు. విమానంలోని హెడ్‌ఫోన్ సెట్ కేబుళ్లతో అతడ్ని కట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో దంత వైద్యుడైన డాక్టర్ షోటా ముసయేవ్, గాయపడిన భారత కెప్టెన్ మచ్చర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. రక్తస్రావాన్ని ఆపి ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంపై దృష్టిసారించారు.
అయితే ఆ విమానం వేగంగా ఎత్తు కోల్పోవడంతో ప్రయాణికులు భయందోళనతో కేకలు వేశారు. కొందరు తమ సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. విమానయాన కార్యక్రమాల టీవీ షోలను ఆసక్తిగా చూసే ఇజ్రాయోలీ ప్లంబర్ యానివ్ హయున్ చాలా కీలకంగా వ్యవహరించారు. పైలట్‌గా ఎలాంటి శిక్షణ లేనప్పటికీ తనకు ఉన్న పరిజ్ఞానంతో తక్షణం స్పందించారు. ప్రమాదకరంగా కిందకు దూసుకెళ్తున్న విమానాన్ని కంట్రోల్ చేశారు. స్టీరింగ్ లివర్లను పైకి లాగాలని తెలియడంతో ఆ పని చేశారు. దీంతో ఆ విమానం తిరిగి నియంత్రణలోకి వచ్చింది.
అదృష్టవశాత్తు విధుల్లో లేని ఇద్దరు పైలట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. వారిద్దరూ వెంటనే పైలట్ బాధ్యతలు చేపట్టారు. తోక భాగానికి భారీగా నష్టం వాటిల్లిన ఆ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం రాత్రికి ఇజ్రాయెల్‌కు సురక్షితంగా చేరుకున్నారు.
అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ మచ్చర్ ప్రస్తుతం యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆయనపై కత్తితో దాడి చేసి విమానం హైజాక్‌తో పాటు కూల్చేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలున్న ఒమన్ కో పైలట్‌పై విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు అన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆ విమానయాన సంస్థ పేర్కొంది.