తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నాటి నుంచి ఉద్యమ నేత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిబద్ధతతో నడిచిన ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఉద్యమ నాయకుడిని కోల్పోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికే తీరని లోటు” అని పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారని తెలిపారు. ఆయన కోలుకోవడానికి పార్టీ తరఫున సాధ్యమైనంత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు.
ఉద్యమ కాలం నుంచే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని, అలాంటి సహచరుడు ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో బాధాకరమని వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన ధైర్యం, నిబద్ధత, త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఉద్యమం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన ఉద్యమ యోధుడిగా, ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలనే తన రాజకీయ అజెండాగా మలుచుకొని జీవితాంతం ప్రజల మధ్యే గడిపిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.