Khubir | కుభీర్, సెప్టెంబర్ 16: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలోని గజ్జలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ద్యావరి సత్యవ్వ రూ.51 వేల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించిన సర్పంచ్ సత్యవ్వను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువకులు అభినందించారు.
పల్సి గ్రామంలోని పురాతన గజ్జలమ్మ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) నిధులను వెచ్చిస్తోంది. ఆలయ నిర్మాణ పనులను కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో సర్పంచ్ ద్యావరి సత్యవ్వ రూ.51 వేల విరాళాన్ని అందించారు.
ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని వీడీసీ, ఆలయ కమిటీ అధ్యక్షులు మెంచు గజేందర్, హేమ్లె రమేష్ కోరారు. కార్యక్రమంలో ద్యావరి రాములు, బీఆర్ఎస్ నాయకులు సిందే భోజరాం పటేల్, గ్రామస్తులు పాల్గొన్నారు.