ముంబై, సెప్టెంబర్ 29: ‘సర్’పై ఎన్నికల సంఘం(ఈసీ)లో అంతర్గత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈసీకీ చెందిన ఈసీఐనెట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించే స్థానిక ఎన్నికల అధికారులకు మరింత విచక్షణాధికారం కల్పించాలని మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) చొక్కలింగం కోరారు. ఈసీఐనెట్ అనేది ఓటర్ జాబితాలు, ఎన్నికలకు సంబంధించిన ఇతర విధులను నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కేంద్రీకృత డిజిటల్ వేదిక.
ఈనెల 24న సీనియర్ ఈసీ అధికారులకు రాసిన లేఖలో ఎన్నికల చట్టం ప్రకారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు(ఈఆర్వో) ఇప్పటికే ఉన్న అధికారాలను వినియోగించుకునేందుకు వీలు కల్పించే లక్ష్యంతో ఈసీఐనెట్లో ఐదు మార్పులను చొక్కలింగం కోరారు. ఈఆర్వోలకు చట్టబద్ధంగా వినియోగించే అధికారాలను ఈ సాఫ్ట్వేర్ పరిమితం చేస్తున్నదని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలనే సీఈవో డిమాండ్లు ప్రతిబింబిస్తున్నాయి.
ఆ తర్వాత ఎన్నికల సంఘం ఈ సమస్యలను పాక్షికంగా పరిష్కరించింది. తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించిన ఓటర్లు అటువంటి సందర్భాల్లో విచారణల కోసం స్వయంగా హాజరుకావలసిన అవసరం లేదని, బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) వారి ఇండ్ల నుండే సంబంధిత పత్రాలను సేకరించి ఈసీఐనెట్లో అప్లోడ్ చేయవచ్చని ఈసీ నిర్ణయించింది. చెల్లుబాటు అయ్యే, సంతృప్తికరమైన పత్రాలను సమర్పించినపుడు ఓటర్లకు వ్యక్తిగత విచారణల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఈఆర్వోలకు ఒక అవకాశం కల్పించాలన్నది చొక్కలింగం అభ్యర్థనలలో ఒకటి.
సర్ నోటీసుల్లో పేర్కొన్న 13 పత్రాలు కాకుండా ఓటర్లు ఇతర పత్రాలను కూడా సమర్పించేందుకు వీలుగా ఒక అదనపు అవకాశాన్ని కల్పించాలని చొక్కలింగం కోరారు. గిరిజన, నిరాశ్రయులు, లైంగిక కార్మికుల వర్గాల వద్ద జాబితాలోని పత్రాలు ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. మునుపటి సర్ జాబితా ఆధారంగా వ్యత్యాసాలను ఇప్పటికే గుర్తించినందున వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో సర్ చివరి సారాంశాన్ని అప్లోడ్ చేయడాన్ని ఐచ్ఛికం చేయాలని చొక్కలింగం డిమాండ్ చేశారు.