కేసీఆర్ హయాంలో సజావుగా నడిచిన వస్త్ర పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సంక్షోభంలోకి నెట్టింది. ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడం, బతుకమ్మ చీరల తయారీని నిలిపివేసింది. నేత కార్మికుల సంక్షేమ పథకాలను నిలిపివేయడంతో ఆర్థిక ఇబ్బందులతో పలువురు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడువేల సాంచాల సప్పుడు ఆగిపోయింది. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకు రూ.60 కోట్ల బకాయిలను చెల్లించకుండా వేధిస్తున్నది. నేతన్నల దయనీయ పరిస్థితి ఇలా ఉంటే, సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన పేరుతో కాంగ్రెస్ హడావుడి చేస్తున్నది. రాజకీయ విమర్శలకు పరిమితమైన సీఎం, తమ సమస్యలపై సమాధానం చెప్పాలని నేతలన్నలు కోరుతున్నరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఆకలిచావులు, ఆత్మహత్యలతో తల్లడిల్లింది. నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎన్టీఆర్ మొదలుకుని చంద్రబాబు, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఉమ్మడి ఏపీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు నేతన్నల కష్టాలను, వారి బలవన్మరణాలను రాజకీయాలకు వాడుకున్నారే తప్ప, ఏనాడూ ఆదుకోలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం, ప్రణాళికలతో నేతన్నల తలరాత మారింది. ఉరిసిల్ల అంటూ పత్రికలు పతాక శీర్షికలు పెట్టిన సిరిసిల్లను మళ్లీ సిరిశాలగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం కృషి చేసిన పాలకుడు కేసీఆర్. నేతన్నల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా కొలువయ్యాక స్థానిక ఎమ్మెల్యే, నాటి మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి హోదాలో కేటీఆర్ సిరిసిల్ల చేనేతల ఆకలిచావులు, ఆత్మహత్యలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిరిసిల్ల నేత పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించేలా కృషి చేశారు.
కేటీఆర్ కృషి ఫలితంగా 2006 నుంచి పేరుకుపోయిన విద్యుత్తు బకాయిలపై ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించింది. దాంతో నేత పరిశ్రమ కష్టాల సుడిగుండం నుంచి బయటపడింది. అంతేకాకుండా నేత కార్మికుల కుటుంబాలకు 35 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చేలా అంత్యోదయ కార్డులను ఇచ్చింది. నేత కార్మిక మహిళలకు పావలా వడ్డీకే రుణాలను అందజేసింది. స్త్రీ స్వయం శక్తి పొదుపు సంఘాలను ప్రోత్సహించింది. రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది.
రాజీవ్ విద్యామిషన్ పాఠశాల యూనిఫాంలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా అందించే వస్త్ర కానుకలకు సంబంధించిన ఆర్డర్లను కూడా సిరిసిల్ల పరిశ్రమకే అందించింది. ప్రభుత్వ ఆర్డర్లతో నేతన్నలకు రూ.3,313 కోట్ల విలువైన పని కల్పించి, వారి ఆదాయాన్ని రూ.20 వేలకు పెరిగేలా చేసింది. తద్వారా నేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులు పూర్తిగా తగ్గిపోయాయి. అత్యాధునిక ధోబీఘాట్, అంతర్జాతీయ ప్రమాణాలు గల అపరెల్ పార్కును నెలకొల్పింది. అందులో ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ నెలకొల్పింది. దానితో ఎంతోమంది యువత ఉపాధి పొందుతున్నారు.
కేటీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లపాటు సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. విద్య, వైద్యం ఉపాధి తదితర రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 30 వేల పవర్‌లూమ్‌లు ఉండగా వాటిలో 15 వేల వరకు కాటన్ బటన్ ఉత్పత్తి చేయగా, మిగతా 15 వేల పవర్‌లూమ్‌లు పాలిస్టర్ వస్ర్తాన్ని ఉత్పత్తి చేసేవి. కాటన్ బట్టల పరిశ్రమకు అనుబంధంగా 26 సైజ్లింగ్లు, 130 వరకు చిన్నతరహా డయింగ్ యూనిట్లు మనుగడ సాగించేవి. సుమారు 3,000 మంది కార్మికులు ఆటో నడుపుతూ, రవాణా హమాలీలుగా పనిచేసేవారు. కేటీఆర్ విజన్‌తో, ఆధునికతతో కూడిన నాయకత్వంతో సిరిసిల్ల ప్రజల భవిష్యత్తుకు అనుగుణంగా పట్టణాన్ని అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు.
కేటీఆర్ ప్రత్యేక చొరవ మేరకు ప్రభుత్వం నేతన్న బీమా, వర్కర్ టు ఓనర్ మొదలైన సంక్షేమ పథకాలను అమలు చేసింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల వల్ల సిరిసిల్లలోని నేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులు కనబడకుండాపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉన్నపలంగా బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసింది. ఇతర ఆర్డర్లను దళారులకు కట్టబెట్టి నేతన్నల ఉపాధిని అతి దారుణంగా దెబ్బతీసింది. దీంతో చిన్న పెట్టుబడితో మగ్గాలను కొని నడిపించుకుంటున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. కనీసం కిరాయిలు కూడా కట్టలేక అవస్థలు పడుతున్నారు. మగ్గాలను అమ్ముకొని ఇతర పనులకు వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఆసాములు కూడా రోడ్డునపడ్డారు. వందకు పైగా జోడీలు వేసుకొని 70-80 మందికి ఉపాధి కల్పించిన పలువురు ఆసాములు, నేడు ఆర్డర్లు లేక ఖార్ఖానాలు మూసివేసుకొని కిరాణా దుకాణాలు నడుపుకొంటున్నారు.
మరోవైపు ప్రభుత్వం నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలపై నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ.60 కోట్లు చెల్లించడంలేదు. అదేవిధంగా నేతన్నలకు నిలిపివేసిన 10% యార్న్ సబ్సిడీ, రూ.5.5 లక్షల నేతన్న బీమాకు ప్రస్తుత పాలకులు ఎగ్గొట్టారు. బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన వీవింగ్, అపెరల్ పార్క్‌ల కార్మికులను యజమానులుగా మార్చే ప్రణాళికలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా విలసిల్లిన సిరిసిల్లకు ఉరివేసిన రేవంత్‌రెడ్డి, ఏ మొఖం పెట్టుకొని వస్తున్నాడని ప్రజానీకం నిలదీస్తున్నారు. ఎన్ని రాజకీయ శక్తులు కలిసినా సిరిసిల్ల ప్రజలు ఎప్పటికీ కేటీఆర్‌కే మద్దతు పలుకుతారని, ఆయన నాయకత్వాన్నే సమర్థిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారనేది కాదనలేని సత్యం.
ఆర్ఆర్ఆర్