సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జలమండలి రెవెన్యూ విభాగం నిర్లక్ష్యం వల్ల విలీన మున్సిపాలిటీలు, గ్రామాలు విలవిలలాడుతున్నాయి. నల్లా బిల్లుల పెండింగ్ పేరిట జలమండలి అందించే సేవలను నిలిపేయడంతో 2.8 లక్షల మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలీన ప్రాంతాల్లో రూ.30 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయి. రెవెన్యూ విభాగం సరిగ్గా పనిచేసి, ప్రతి వినియోగదారుడి వద్దకు జలమండలి పరిధిలో ఉన్న 673 మంది మీటర్ రీడర్లను విధిగా పంపిస్తే పెండింగ్ బిల్లులు వసూలు చేయవచ్చు.
కానీ ఆ దిశగా పనిచేయకపోవడంతో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో 2.8 లక్షల మంది వినియోగదారులు జలమండలి సేవలకు దూరమవుతున్నారు. నల్లా బిల్లులు పెండింగ్‌లో ఉంటే జలమండలి నుంచి అందే సేవలన్నింటినీ నిలిపేసే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. బిల్లు చెల్లించలేదని ట్యాంకర్ బుకింగ్స్ నిలిపేశారు. మురుగు సమస్యలపై ఫిర్యాదులు కూడా చేయలేని పరిస్థితులు విలీన ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఈనేపథ్యంలో రెవెన్యూ విభాగం సక్రమంగా పనిచేయకుండా, బిల్లులు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు జలమండలి సేవలకు దూరమవుతున్నారు.
మొదటి నుంచి చిన్నచూపే…
ప్రజలకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణను మరింత చేరువ చేసేందుకు అప్పటి ప్రభుత్వం 2021 ఏప్రిల్ 1 నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను జలమండలిలో విలీనం చేసింది. కానీ కరోనా, మున్సిపాలిటీలు, పంచాయతీ అధికారులు వినియోగదారుల వివరాలను పూర్తిస్థాయిలో ఇవ్వలేదనే సాకుతో 2023 చివరి దాకా నల్లా బిల్లులు వసూలు చేయలేదు. కానీ 2021 నుంచే ప్రతి వినియోగదారుడికి క్యాన్ నెంబర్ జనరేట్ చేసి బిల్లులు వేస్తూ వేలాది రూపాయలు పెండింగ్ చూపారు.
కనీసం ఆ తర్వాతనైనా విలీన ప్రాంతాలను గుర్తించి ప్రతి వినియోగదారుడి ఇంటికి వెళ్లి బిల్లులు వసూలు చేయలేదు. ఇప్పటికీ చాలా కాలనీలు, బస్తీల ప్రజల ఇంటికి జలమండలి మీటర్ రీడర్లు రావడం లేదని వినియోగదారులు చెప్తున్నారు. కానీ ప్రతినెలా మినిమం బిల్లు రూ.248 చెల్లించాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. కానీ బిల్లుల కోసం జలమండలి సిబ్బంది రావడం లేదని వాపోతున్నారు. దీంతో కనీసం 10 శాతం మంది కూడా బిల్లులు చెల్లించడం లేదు. అధికారులు బాధ్యతగా వినియోగదారుల వద్దకు వెళ్లి బిల్లు చెల్లించాలని ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. దీంతో తాము బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులు అనుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ విభాగం మౌనంగా ఉంటున్నది.
రెవెన్యూ పెంచేందుకు చర్యలు శూన్యం
జలమండలి లోటు బడ్జెట్లో కొనసాగుతున్నది. ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో బడ్జెట్ కేటాయింపును కుదిస్తూ వస్తున్నది. కేటాయించిన బడ్జెట్లోనూ కోత విధిస్తున్నది. జలమండలికి రాబడి వనరుగా ఉన్న నల్లా బిల్లులు కూడా రెవెన్యూ అధికారులు సక్రమంగా వసూలు చేయకపోవడంతో జలమండలి ఆదాయం మరింత క్షీణిస్తున్నది. రెవెన్యూ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో వేలాది రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో విలీన ప్రాంతాలను గాలికొదిలేయడంతో ఒక్కో వినియోగదారుడి వద్ద వేలాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నల్లా బిల్లు చెల్లించకున్నా ఫర్వాలేదని వినియోగదారులు భావిస్తున్నారు. పెండిం గ్ ఎక్కువగా ఉన్నవారికి రాయితీలు ఇస్తే కొంతవరకైనా వసూలు చేసుకోవచ్చు. జలమండలి పరిధిలో ఉన్న 673 మంది మీటర్ రీడర్లను విలీన గ్రామాలకు పంపి బిల్లులు వసూలు చేసి, జలమండలి సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.