హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దోచుకో దాచుకో అనే రీతిలో సాగుతున్నదని, నిన్నటి వరకు గురుకులాల్లో రూ.2,000 కోట్ల రూపాయలు దోపిడీ మరువక ముందే డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని విద్యుత్తు శాఖలోనే రూ.1,500 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలను పూర్తిగా వంచించిందని ధ్వజమెత్తారు. 2023 ఆగస్టులో జరిగిన చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ లెకలేనన్ని హామీలు గుప్పించిందని, తీరా అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులకు చిన్నపాటి కాంట్రాక్టులు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. దళితవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార శాఖల్లోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రజలంతా ‘భట్టీ ఇక తీసుకో చుట్టీ’ అని నినదిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పనులు దకకుండా కుట్ర
విద్యుత్తు శాఖలో దళితులు, గిరిజనులకు పనులు దకకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆర్ఎస్పీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు పనులు దకించుకోకుండా 5 నుంచి 6 సబ్స్టేషన్లను ఒకే దగ్గరకు చేర్చి ప్యాకేజీ టెండర్లు పిలుస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌లో సైతం 9 సబ్ స్టేషన్లను కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్లు కేటాయించారని ఎత్తిచూపారు. సాంకేతిక, ఆర్థిక అంచనాలు లేకుండానే కోమటిరెడ్డి పృథ్వీరెడ్డి అకడ పనులు చేస్తున్నారని, దీనిపై అధికార పక్షానికి చెందిన దళిత ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు స్పం దించి చావు డప్పు తీసుకొని వికారాబాద్‌కు ఎందుకు వెళ్లడం లేదని, వారు వెంటనే అకడికి వెళ్లి నిలదీయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో చరిత్రాత్మక జీవో 29
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగునీటి పారుదల శాఖలో బీసీ, దళిత, గిరిజన కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 29ని చరిత్రాత్మకంగా తీసుకొచ్చారని, అదే రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్ టెండర్లకు మదర్ జీవోగా మారిందని ఆర్ఎస్పీ వివరించారు. మరిప్పుడు అదే జీవో 29ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తన సొంత శాఖలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో గురుకులాల్లో రూ.2 వేల కోట్ల టెండర్లను మఫత్ లాల్, నిరంజన్ జైన్, రమేశ్ జైన్లకు కట్టబెట్టారని.. ఇప్పుడు ఏకంగా భట్టి ఆధ్వర్యంలోని విద్యుత్తు శాఖలోనే రూ.1,500 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని మండిపడ్డారు. దళిత, గిరిజనుల హకులను కాలరాస్తూ విద్యుత్తు సబ్ స్టేషన్ల కోసం పిలిచిన అక్రమ ప్యాకేజీ టెండర్లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవి రద్దయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
సీఎంవోలో ఒక ఎస్సీ, ఎస్టీ అధికారీ లేడు
పాలనా యంత్రాంగంలో రేవంత్‌రెడ్డి వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎంవోలో ఒకరంటే ఒక ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా లేడని, తన దరిదాపుల్లోకి దళితులెవరూ రాకుండా రేవంత్‌రెడ్డి సచివాలయంలో పసుపు నీళ్లు చల్లించుకున్నా రా? అని ప్రశ్నించారు. పాలన ఇంతలా దిగజారడం వల్లే విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టర్లు చివరికి సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ఎదుట ధర్నా చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ నేతలు తమ స్వార్థాన్ని వీడి ఈ అన్యాయాలపై సీఎం రేవంత్‌ను నిలదీయాలని కోరారు.
విద్యుత్తు శాఖలో ప్యాకేజీని రద్దు చేయాలి
ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు పనుల్లో న్యాయమైన వాటా దకాలంటే తక్షణమే విద్యుత్తు శాఖలో ప్యాకేజీ విధానాన్ని రద్దు చేయాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ ఏ ప్రభుత్వ పని చేపట్టినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు పకాగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయించలేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తన పాస్‌పోర్టు సీజ్ చేశారు కాబట్టే కేటీఆర్ పాస్ పోర్టును కూడా సీజ్ చేయాలని రేవంత్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, కురువ పల్లయ్య, వీరబాబు, రాజు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై అసత్య ప్రచారం
కేటీఆర్ సహా నలుగురి పాస్ పోర్టుల జప్తునకు సంబంధించి కోర్టు లేఖ రాసిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. న్యాయస్థానాలు లేఖలు రాయవని, కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తాయని స్పష్టంచేశారు. ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో ఒక మెమో మాత్రమే దాఖలు చేశారని, కేటీఆర్‌కు గానీ, ఆయన తరఫు న్యాయవాదులకు గానీ కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్‌తో పాటు అందరి పాస్ పోర్టులు వారి వద్దే భద్రంగా ఉన్నాయని స్పష్టంచేశారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లి అకడ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తుండటం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏమాత్రం నచ్చడం లేదని ఎద్దేవాచేశారు.