ఎమోషన్స్, పీరియడ్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. శ్రీవిష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈచిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. అక్టోబర్ 9న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎత్తర ఎత్తు..’ సాంగ్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి పాటను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘మోచేతీ నీళ్లతోటి ఏ దప్పిక తీరదంట.. బుసకొట్టిన పాము మీద చీమలు దండెత్తెనంట..
రాసుకుంటె అగ్గిరవ్వ అడివంతా బూడిదంట.. మనదేమో మురికివాడ.. ఆడిది అద్దాలమేడ.. మన నెత్తురు తాగినాది ఆడింటి ఇటుక పెడ్డ.. చల్.. ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎత్తర ఎత్తు గునపం ఎత్తు..’ అంటూ విప్లవాత్మక ధోరణిలో భాస్కరభట్ల రాసిన ఈ పాటను విజయ్ బుల్గానిన్ స్వరపరచగా, నల్గొండ గద్దర్ నర్సన్న తనదైన ధోరణిలో ఆలపించారు. ఈ పాటలో శ్రీవిష్ణు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలకపాత్రలు పోషించిన ఈచిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్.