Khelo India | ఎర్రుపాలెం, సెప్టెంబర్ 16 : ఖో-ఖో క్రీడలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం వి.వి.ఆర్.జి.పి. ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల పీఈటీ నరాల సాంబశివారెడ్డి తెలిపారు.
ఈ నెల 10న ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖో-ఖో ఎంపిక పోటీల్లో 110 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన భీమవరం పాఠశాల విద్యార్థినులు శీలం తేజశ్రీ, గండు రాధిక, పమ్మి వెంకటలక్ష్మి ఉస్మిత, తల్లపురెడ్డి ఉదయలక్ష్మి సంజన ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 17న హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న ఖో-ఖో పోటీల్లో నాకౌట్ పద్ధతిలో పాల్గొననున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను తెలంగాణ రాష్ట్ర ఖో-ఖో జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పీఈటీ తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలతో పాటు భీమవరం గ్రామం, ఎర్రుపాలెం మండలానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పీఈటీ నరాల సాంబశివారెడ్డి ఆకాంక్షించారు.
విద్యార్థినులు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. ఉపేందర్, సర్పంచ్ వంగల నాగేశ్వరరావు, ఏఏపీసీ చైర్మన్ తులిశమ్మ, పీఈటీ నరాల సాంబశివారెడ్డి, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థినులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.