Deewana | థియేటర్లలో ప్రేక్షకులను అలరించి, మంచి విజయాన్ని అందుకున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘దీవానా’ (Deewana) ఇప్పుడు అధికారికంగా ఓటీటీలోకి వచ్చేసింది. హర్షిత్ రెడ్డి మరియు స్నేహ మణి మేఘాలై ప్రధాన జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రేమకథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) సొంతం చేసుకుంది. ప్రారంభంలో ఈ సినిమా ‘గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, నేటి నుంచి సాధారణ సబ్స్క్రైబర్లందరికీ కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే హాయిగా వీక్షించవచ్చు.
కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఎల్లప్పుడూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ, అల్లరిచిల్లరగా ఉండే ఒక యువకుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేసే అమూల్య (స్నేహ)ను చూసిన మున్నా, ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అమూల్యను దక్కించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు. అయితే, అమూల్య మాత్రం మొదట్లో అతన్ని పట్టించుకోదు. మరి ఈ ప్రేమకథలో ఎలాంటి మలుపులు తిరిగింది? మున్నా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ‘దీవానా’ సినిమా చూడాల్సిందే!