హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఆస్ట్రేలియా స్థానిక పాలనారంగంలో భారత సంతతికి చెందిన మహిళ సరికొత్త చరిత్ర లిఖించారు. న్యూసౌత్ వేల్స్ పరిధిలోని ప్రముఖ కౌన్సిల్ స్ట్రాత్ ఫీల్డ్ మేయర్గా తెలంగాణ(హైదరాబాద్)కు చెందిన సంధ్యారెడ్డి(శాండీ) మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత సంతతి, తెలంగాణగడ్డకు చెందిన వ్యక్తి ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఈ అత్యున్నత పదవికి ఎన్నికవడంపై ప్రవాస భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ప్రజాసమస్యల పరిషారంలో చురుకైన పాత్ర పోషిస్తూ, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ఆమె నాయకత్వ పటిమను గుర్తించిన కౌన్సిల్ సభ్యులు, ఈ బాధ్యతలు అప్పగించారు. స్ట్రాత్ ఫీల్డ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన సంధ్యారెడ్డికి బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మన ప్రాంతానికి చెందిన మహిళ విదేశీగడ్డపై ఉన్నత శిఖరాలు అధిరోహించడం యావత్ తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు.