ముంబై : ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న ఫుట్‌బాల్ దిగ్గజం ఇటలీ టీ20 ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించింది. ఈ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఆ జట్టు.. తమ రెండో మ్యాచ్‌లోనే బోణీ కొట్టి ప్రపంచకప్‌లో తమ మొదటి విజయాన్ని నమోదుచేసింది. గురువారం ప్రఖ్యాత వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన పోరులో ఆ జట్టు.. నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. నేపాల్ నిర్దేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 12.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా దంచేసింది.
ఇటలీ ఓపెనింగ్ సోదర ద్వయం ఆంథోని మోస్కా (32 బంతుల్లో 62, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్.. క్రిషన్ కలుగమగె (3/18), బెన్ మనెంటి (2/9) ధాటికి 19.3 ఓవర్లలో 123 రన్స్‌కే కుప్పకూలింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వణికించిన నేపాలీలు.. రెండో మ్యాచ్‌లో మాత్రం తమకంటే తక్కువ ర్యాంకు కల్గిన జట్టుపై చేతులెత్తేశారు. ఆరిఫ్ షేక్ (24 బంతుల్లో 27, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సిడ్నీలో పుట్టి పెరిగిన మోస్కా బ్రదర్స్.. నేపాలీ బౌలర్లపై ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు మరో 7.2 ఓవర్లు మిగిలుండగానే గెలిచి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.