Nennela School | కాంగ్రెస్ సర్కార్ పాఠశాల విద్యార్థులకు అన్ని సౌకర్యలు కల్పిస్తామని.. అన్నీ ఉచితంగా అందిస్తామని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించలేదు. ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ చివరకు అత్యంత ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవం రోజుకైనా అందుతాయనుకున్న దుస్తులు అందలేదు. ప్రభుత్వం రెండు రోజుల కిందట విద్యార్థులకు షూలు మాత్రమే అందించింది.
దీంతో విద్యార్థులు చేసేదేమీ లేక తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్‌తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు. సాధారణంగా స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థులు ఏకరూప దుస్తులతో, వివిధ వేశాధారణలో పాల్గొని ఉత్సహంతో కనబడుతారు. కానీ ప్రభుత్వం విద్యార్థులకు కేవలం షూలు మాత్రమే అందించి.. యూనిఫామ్‌లు మాత్రం అందించడంతో విద్యార్థులు కొత్త షూలు వేసుకొని పాత దుస్తులతో వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యార్థులు నిరుత్సాహంగా కనిపించడం ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. సమయానికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందక పోవడం, మల్టీ దుస్తులతో ఉండటంతో వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. ఏనాడూ ఇలా యూనిఫామ్ లు లేక స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనలేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. రేవంత్ సర్కార్ హయాంలో విద్యాశాఖ పట్ల ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారో తాజా ఘటన మరోసారి అద్దం పడుతోంది.