Miss World: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 73వ ‘మిస్ వరల్డ్’ పోటీలు మొదలయ్యాయి. వియత్నాం వేదికగా జరుగుతున్న ఈ అందాల వేడుకలో విజేత ఎవరో మరొకొన్ని గంటల్లో తేలిపోనుంది. సొగసుగత్తెలంతా ఒక్కచోట చేరి అందంతో పాటు తెలివి తేటలను ప్రదర్శించే గ్రాండ్ ఫినాలేలో భారత్ నుంచి నిఖితా పొర్వాల్ (Nikhita Porwal) బరిలో నిలిచింది. గతంలో ఆరుసార్లు ఈ వేదికపై సగర్వంగా కిరీటం ధరించిన భారతీయ సుందరాంగుల సరసన తన పేరు రాసుకోవాలని నిఖితా పట్టుదలతో ఉంది. ఈ సందర్భంగా ‘మిస్ ఇండియా’ సంస్థ ప్రత్యేక వీడియో పోస్ట్ చేసింది. గతంలో మనదేశం తరఫున మిస్ వరల్డ్ టైటిల్ గెలుపొందిని వారిని మరోసారి గుర్తు చేసుకుంది.
అందాల పోటీల్లో మెరిసి.. మోడల్, సినీతారలుగా కెరీర్ నిర్మించుకోవాలని కలలు కంటున్న అమ్మాయిల కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. ప్రపంచంలోని సుందరాంగుల సందడితో వియత్నాం వేదికగా మిస్ వరల్డ్ 2026 పోటీలు జరుగుతున్నాయి. ‘టైటిల్ పోరులో విజేతగా నిలిచేది ఎవరు?’ అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిరుడు సుచత చౌంగ్‌శ్రీ(థాయ్‌లాండ్) కిరీటాన్ని ఎగరేసుకుపోగా.. ఈ దఫా భారత్ నుంచి నిఖితా పొర్వల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఉజ్జయినికి చెందిన నిఖిత ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్- 2024’ విజేత. 73వ మిస్ వరల్డ్‌లో సత్తా చాటి టైటిల్ గెలవాలనుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ నేపత్యంలో.. గతంలో మిస్ వరల్డ్ కిరీటంతో యావత్ భారతావని గర్వపడేలా చేసిన ఆరుగురు అందగత్తెల వీడియో పంచుకుంది మిస్ ఇండియా సంస్థ. మన దేశపు తొలి మిస్ వరల్డ్ రీటా ఫారియా నుంచి మానుషి చిల్లర్ విజేతగా నిలిచిన అద్భుత క్షణాలను మరోసారి మన కళ్లముందు నిలిపింది.
రీటా ఫారియా : భారత దేశంలో మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ విజేతగా చరిత్ర సృష్టించింది రీటా ఫారియా. 1966 మిస్ వరల్డ్ పోటీల్లో అందం, అభినయంతో పాటు తెలివితేటలతో ఆకట్టుకున్న రీట కిరీటం సాధించింది. అనంతరం ఆమెకు బోలెడు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, తను మాత్రం వైద్య విద్యకే ప్రాధాన్యమిచ్చింది. లండన్‌లో చదువు పూర్తయ్యాక.. డాక్టర్ డేవిడ్ పావెల్‌ను పెళ్లి చేసుకున్న రీట 1971లో డబ్లిన్(ఐర్లాండ్)కు మకాం మార్చింది.

ఐశ్వర్య రాయ్ : పిల్లి కళ్ల సుందరిగా పేరొందిన ఐశ్వర్య రాయ్ మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను అందుకుంది. దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఐశ్వర్య విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమెను తదుపరి మిస్ వరల్డ్‌లో ఉండాల్సిన లక్షణాల గురించి జడ్జిలు ప్రశ్నించారు. అందుకు.. వెనకబడిన వర్గాల పట్ల ప్రేమ, దయతో ఉండడం విజేతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అని చెప్పింది ఐస్.
29 Years of Aishwarya Rai winning Miss World. The Final Answer and Winning Moment of Aishwarya Rai at Miss World Pageant 1994. Love her for staying true to her words by helping underprivileged. 🔥💖#AishwaryaRaiBachchan pic.twitter.com/AsKMelxeQr
— Empress Aishwarya Fan (@badass_aishfan) November 19, 2023
డయానా హెడేన్ : తనకంటే ముందు భారత్‌కు మిస్ వరల్డ్ టైటిల్ అందించిన రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్ కంటే డయానా హెడేన్ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే తను.. మిస్ వరల్డ్ టైటిల్‌తో పాటు ప్రత్యేక అవార్డులతో అదరగొట్టింది. 1997లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తను.. మిస్ ఫొటోజెనిక్, స్విమ్ సూట్ స్పెషల్ అవార్డులు సాధించింది. ప్రస్తుతం డయాన ఓ రచయిత. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.

ఇంతకూ ఈ సుందరిది హైదరాబాదే. ఆంగ్లో ఇండియన్ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివింది. అయితే.. ఆమె స్కూల్ రోజుల్లోనే తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో.. 13 ఏళ్ల నుంచే డయానకు కష్టాలు మొదలయ్యాయి. ఒక ఈవెంట్ కంపెనీలో పనిచేస్తుండగా.. మోడలింగ్ మీద ఇష్టం పెంచుకుంది తను.
యుక్తా మొఖే : 1999లో మిస్ వరల్డ్ కిరీటంతో భారతీయులను సంబురాల్లో ముంచెత్తింది యుక్తా మొఖే. ప్రపంచంలో మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? అని ఫైనల్లో ఆమెను ప్రశ్నించారు. అందుకు తను.. ‘నేను బ్రిటన్ నటి ఆండ్రే హెప్‌బర్న్‌లా ఉండాలనుకుంటున్నా’ అని సమాధానం చెప్పింది.
‘నాకు ఆండ్రే హెప్‌బర్న్‌లా ఉండాలనుంది. బ్రిటన్ నటి అయిన ఆండ్రే అందగత్తె మాత్రమే కాదు మనసున్న మనిషి. ఇతరుల బాధను తను అర్దం చేసుకుంటుంది’ అని బదులివ్వడంతో ఆమెనే విజేతగా ప్రకటించారు. మోడల్, నటి అయిన యుక్త పౌర హక్కుల కార్యకర్త కూడా. ఆమె పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం ఒకే ఒక చిత్రం చేసింది.
యుక్తా మొఖే

ప్రియాంకా చోప్రా : బాలీవుడ్ నుంచి గ్లోబల్ నటిగా గుర్తింపు సాధించిన ప్రియాంక చోప్రా 18 ఏళ్లకే మిస్ వరల్డ్ అయింది. 2000 సంవత్సరంలో లండన్‌లోని మిలీనియం డోమ్‌లో జరిగిన ఫైనల్లో ప్రియాంకను ఈ కిరీటం వరించింది. మిస్ వరల్డ్‌గా వెండితెరపై అడుగుపెట్టిన వచ్చిన ప్రియాంక.. ‘ఫ్యాషన్’, ‘బర్ఫీ’, ‘బాజీరావు మస్తానీ’ వంటి చిత్రాలతో హిట్స్ అందుకొని అగ్రకథానాయికగా ఎదిగింది. ‘సిటాడెల్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌తో హాలీవుడ్‌లోనూ సత్తా చాటింది ప్రియాంక.
మానుషి చిల్లర్ : ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గెలుపొందిన 17 ఏళ్లకు మానుషి చిల్లర్ మనదేశానికి ఈ కిరీటాన్ని తీసుకొచ్చింది. హృద్రోగ సర్జన్ అవ్వాలనుకున్న మానుషి 20 ఏళ్లకు అందాల పోట్లీలో విజేతగా నిలిచింది. నీ దృష్టిలో ఏ ఉద్యోగానికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు? అని ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను ప్రశ్నించారు.
India’s Manushi Chillar Crowned Miss World 2017. Witness The Proud Moment In Case You Missed It. 🇮🇳🇮🇳🇮🇳
Congrats Manushi Chhillar 🙏🇮🇳#ManushiChhillar #MissWorld2017 #MissWorld pic.twitter.com/SiUlDPmOwJ
— Sir Jadeja fan (@SirJadeja) November 18, 2017
అందుకు ఏమాత్రం తడుముకోకుండా అమ్మకు ఇవ్వాలి అని చెప్పేసింది. ‘నా దృష్టిలో అమ్మకు అత్యంత గౌరవం దక్కాలి. అలాఅనీ ఎక్కువ డబ్బులు ఇవ్వాలని నేను అనను. అంతకంటే ముఖ్యంగా ఆమె మనందరికి పంచే ప్రేమ, గౌరవాన్ని తిరిగి ఇవ్వాలి. నా జీవితంలో మా అమ్మే నాకు అతిపెద్ద స్ఫూర్తిదాయిని. అందుకని.. అమ్మకు అత్యంత గౌరవం దక్కాలి’ అని మానుషి చెప్పింది. ఆమె సమాధానం విన్న జడ్జిలు.. ‘మిస్ వరల్డ్ నువ్వే’ అని అభినందించారు.