ముందు ప్రకటించిన తేదీలో కాకుండా, వేరే తేదీలో విడుదల కావడం సినిమాలకు పరిపాటే. ఇప్పుడు ఆ జాబితాలో నాని ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా చేరింది. గతంలో ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. మారిన సమీకరణాలు, ఆ సమయంలో విడుదల కానున్న సినిమాలు, ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ఆగస్ట్ 21కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది.
నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ని వందమంది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. నాని పాత్రలోని రా ఎనర్జీకి సరిపోయేలా హై ఓల్టేజ్ బీట్తో అనిరుథ్ ఈ పాటను స్వరపరిచారని, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్ అనీ మేకర్స్ తెలిపారు. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సంపూర్ణేష్‌బాబు, రాఘవ్ జుయల్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ సాయి.