ముంబై, ఫిబ్రవరి 12 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏఐ భయాల నడుమ మదుపరులు ఐటీ రంగ షేర్లకు దూరం జరిగారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలపై ఆశలు సన్నగిల్లడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 558.72 పాయింట్లు లేదా 0.66 శాతం కోల్పోయి 83,674.92 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 716.97 పాయింట్లు దిగజారింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 146.65 పాయింట్లు లేదా 0.57 శాతం పడిపోయి 25,807.20 వద్ద నిలిచింది.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్, విప్రో షేర్లు బీఎస్ఈలో 6 శాతం వరకు, ఎన్ఎస్ఈలో 6 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ రంగ సూచీ 5.40 శాతం, ఐటీ రంగ సూచీ 5.29 శాతం క్షీణించాయి.
కొత్తగా వచ్చే ఏఐ మాడల్స్.. సంప్రదాయ ఐటీ సేవలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్న ఆందోళనలు మదుపరులను వేధిస్తున్నాయి. ఫలితంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంటున్నది. ఈ క్రమంలోనే టీసీఎస్ మార్కెట్ విలువ తొలిసారి రూ.10 లక్షల కోట్ల మార్కు దిగువకు క్షీణించింది. గురువారం ట్రేడింగ్ చివర్లో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,95, 661.50 కోట్లుగా ఉన్నది. దీంతో మార్కెట్ విలువ ఆధారంగా సెన్సెక్స్ టాప్-10 షేర్లలో టీసీఎస్ 6వ స్థానానికి దిగజారింది.
