హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల(Telangana Schools) సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గడిచిన ఏడాదితో పోలిస్తే.. 2025-26 సంవత్సరంలో 1969 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. మరో వైపు ప్రైవేటు స్కూళ్ల సంఖ్య మాత్రం రాష్ట్రంలో పెరుగుతున్నట్లు తెలిసింది. ఇదే వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో 771 ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరిగినట్లు విద్యాశాఖకు చెందిన యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ డేటా ద్వారా వెల్లడైంది. గత పదేళ్లలో తెలంగాణలో యూడీఐఎస్ఈ ప్లస్ డేటా ప్రకారం ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 41 శాతం పెరిగింది. వీటిల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ 64.5 శాతంగా ఉన్నట్లు తెలిసింది.
మరో వైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియ క్షీణించింది. ఎన్రోల్మెంట్ 8 శాతం తగ్గినట్లు డేటా ప్రకారం తెలుస్తోంది. ప్రైవేటు స్కూళ్లు పేరెంట్స్, విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే కోవిడ్19 మహమ్మారి సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగినా.. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్య తగ్గడం కొంత కలవరపడే అంశమే అవుతుంది. 2016-17 నుంచి 2025-26 మధ్య కాలంలో తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య 43,134 నుంచి 41,762కు పడిపోయింది. సుమారు 3.2% ప్రభుత్వ స్కూళ్లు మూతపడినట్లు తెలుస్తోంది.