‘ప్రేమ కోసం… ఏదైనా చేస్తాను’ అనడం వేరు, చేయడం వేరు! ‘నేను నిన్నెందుకు ప్రేమించాలి?’ అన్న ప్రశ్నకు ఆ యువకుడు ఓ అందమైన సమాధానం చెప్పాడు. ముప్పయ్ దేశాలు తిరుగుతూ.. ముచ్చటైన ప్రదేశాలు చుట్టేస్తూ… ‘నువ్వుంటే నా జతగా.. ఇవన్నీ కలిసి విహరిద్దాం’ అంటూ ఓ నవలే రాశాడు!అదే ‘ది స్కాటిష్ గర్ల్’. సినిమా డైరెక్టర్ కావాలనుకున్న గజ్వేల్ పిల్లగాడు శ్యామ్ మైల్స్టోన్ (శ్యామ్ దాసరి) రచయితగా ఎందుకు మారాడు? ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
అనుకున్న కల చెదిరిపోతే బెదిరిపోయే రకం కాదు నేను. మరోసారి ప్రయత్నిస్తాను. మళ్లీ ఓడిపోయినా.. గెలిచే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా కెరీర్ ఇంకా పట్టాలెక్కలేదు కానీ, నా బతుకుబండి మాత్రం.. పెండ్లికి ముందే ప్రపంచమంతా చుట్టేసింది. మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. గజ్వేల్‌లో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో కొత్త సినిమా విడుదలైతే చాలు.. మొదటి ఆట చూడాల్సిందే! మా కాలేజీలో అమలాపురం, శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల విద్యార్థులు ఉండేవాళ్లు. ఆయా సినిమాలు తమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకొన్నాయని వాళ్లు చెబుతుండేవాళ్లు. ఆ ప్రదేశాలు చుట్టేసి రావాలని నాకు అనిపిస్తూ ఉండేది. నానాటికీ సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. స్నేహితుడి సలహాతో చెన్నైకి వెళ్లి ఫిల్మ్ టెక్నాలజీ కోర్స్ చదివా. దర్శకుడు కావాలని 2010లో హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో అడుగుపెట్టా.
నిరాశే మిగిలింది
దర్శకుడిగా రాణించాలని ఎన్నో స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నా. 2011లో రైలుబడి పుస్తకం ఆధారంగా చిన్నపిల్లలతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా. ‘హిందు’ పేరుతో షూటింగ్ కూడా మొదలుపెట్టాను. కానీ, మధ్యలోనే నిలిచిపోయింది. 2016లో మరో కథను సిద్ధం చేసుకున్నా. నిర్మాత ఓకే చెప్పి, ఫామ్‌లో ఉన్న ఓ హీరోకు కథ వినిపించమన్నారు. థ్రిల్లర్ కథలు వద్దని ఆ హీరో నా కథను తిరస్కరించాడు. మూడోసారి ఓ ఎన్ఆర్ఐ నిర్మాతకు నా కథ నచ్చినా.. చివరి నిమిషంలో నిలిచిపోయింది. అయినా నేను నిరాశ చెందడం లేదు. ఈ తరానికి తగ్గట్టుగా కథలు రెడీ చేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాను.
ఆమె వల్లే ఆరంభం
సినీ‘మాయ’లో పడ్డ నాకు పెండ్లి సంబంధాలు రిజెక్ట్ అవుతూ వచ్చాయి. ఒకరకంగా డ్రిపెషన్లోకి వెళ్తున్న తరుణంలో… ఓ అద్భుతం నా కంటపడింది. స్కాట్లాండ్కు చెందిన ఓ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో చూసి.. తను నా కోసమే పుట్టిందని ఫిక్సయ్యాను. ఆమె మీద మనసు పారేసుకున్నాను. ‘నువ్వంటే నాకు ఇష్టం. ఒప్పుకొంటే పెండ్లి చేసుకుంటా’ అని కామెంట్ పెట్టేశా. దానికి ఆమె రియాక్ట్ అవుతూ.. ‘నేను అందరిలా కాదు. నాకోసం ఏదైనా చేసే ధైర్యం నీకుందా?’ అని రిప్లే ఇచ్చింది. అలా మా మధ్య మెసేజ్‌లు సాగుతుండగా.. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలని బలంగా ఫిక్సయ్యాను. అది చాలా కొత్తగా ఉండాలనుకున్నాను. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘ది స్కాటిష్ గర్ల్’ నవల.
30దేశాలు తిరిగి రాశా
ఆమె కోసం పుస్తకం రాయాలనుకున్నా. సాదాసీదాగా రాస్తే కిక్ ఏముంటుంది. అందులో నా ప్రేమంతా కనిపించాలనుకున్నా. తను నా వెంట నడిస్తే మా జీవితం ఎలా ఉంటుందో ఆ నవలలో చెప్పాలనుకున్నా. పెండ్లయ్యాక తనకు నేను ఏఏ ప్రదేశాలు చూపించాలని అనుకున్నానో… ఆ ప్రదేశాలకు ఒంటరిగానే వెళ్లి, జంటగా వస్తే ఎలా ఉంటుందో ఊహించి, అక్షరీకరించా. ఇందుకోసం 2022 ఫిబ్రవరిలో దక్షిణ భారతమంతా తిరిగాను. ఆ తర్వాత ఆరు నెలలపాటు టర్కీ, భూటాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాలన్నీ తిరుగుతూ నేపాల్‌లో నా ప్రయాణం ముగించా. ఇవన్నీ విహరించడానికి నాకు రూ.కోటి దాకా ఖర్చయ్యాయి. కానీ, ఈ ప్రయాణంలో రకరకాల మనుషులు కలిశారు. అనేక భావాలు తెలుసుకున్నా. తను నా పక్కన లేకున్నా.. ఇద్దరం కలిసే అవన్నీ తిరిగామన్న అనుభూతి కలిగింది.
అందుకే కలవలేదు
ఈ ప్రయాణంలో చిత్రవిచిత్రమైన అనుభవాలూ ఎదురయ్యాయి. ఇరాన్లో ఓ కుటుంబం పరిచయమైంది. నా కథ విని ఎంతో ఇంప్రెస్ అయ్యారు. వాళ్లింటికి తీసుకెళ్లి ఆతిథ్యమిచ్చారు. ఈ విహారంలో నా ప్రేయసి దేశం స్కాట్లాండ్కూ వెళ్లాను. అంత దూరం వెళ్లినా… తనను కలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. ఆమె కోసం అప్పటికి నేను చేసిందేం లేదు. ఈ నవల పూర్తయ్యాకే కలవాలన్నది నా నిర్ణయం. ఇంటికి దూరమయ్యానని మావాళ్లు ఒకటే రభస. డబ్బులు తగిలేస్తున్నావని గొడవ. ప్రేమ ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందుకే, అవేం నేను పట్టించుకోలేదు.
ఆమెకు కానుకగా
నా విహార యాత్ర 2022 చివరికి పూర్తయింది. కానీ, నా అనుభూతికి నవలా రూపం ఇవ్వడానికి చాలాకాలం పట్టింది. ప్రతి సన్నివేశాన్ని మనసు పెట్టి మలిచాను. ఎలాగైతేనేం.. మూడేండ్లకు ‘ది స్కాటిష్ గర్ల్’ నవల పూర్తయింది. ఇప్పటికీ మా మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నది. అందుకే ఈ నవల కవర్‌పేజీపై తన ఫొటోను ముద్రించా. తనకు తెలుగు రాదు కాబట్టి.. ఈ నవలను ఇతర భాషల్లోకి అనువదించి, నా ప్రేమ కానుకగా తనకు ఇస్తాను. ఆమె అడిగిన ప్రశ్నకు నా సమాధానం చూసి సంతృప్తి చెందుతుందని ఆశిస్తున్నా! ఇంతకష్టపడి, ఇష్టపడి రాసిన నవలకు బూకర్ ప్రైజ్ వస్తుందన్న ఆశతో ఉన్నా! సినిమాలపై నా ఇష్టం ఇంకా అలాగే ఉంది. ఎప్పటికైనా దర్శకుడిగా మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మనసులూ గెలుచుకుంటా!
ఊహల్లో విహరించి కథ రాయడానికి, అనుభవాలను అక్షరీకరించడానికి చాలా తేడా ఉంది. ఊహల్లో ఉద్భవించిన కథలు అందంగా ఉంటాయేమో! కానీ, అనుభవంలో నుంచి పుట్టిన కథల్లో ఆత్మ ఉంటుంది. 2025 ఆగస్టులో ‘ది స్కాటిష్ గర్ల్’ ప్రచురితమైంది. మొన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో దీనికి మంచి స్పందన వచ్చింది. జనవరి 19న నా బేబీ (ప్రేయసి) పుట్టిన రోజు. ఈ సందర్భంగా నా నవల కవర్ పేజీని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించి నా ప్రేమను ఎలుగెత్తి చాటాను.
– రాజు పిల్లనగోయిన