RI Misfire | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) హెచ్. సతీష్ దుర్మరణం చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్ఐ సతీష్ ఎన్.ఎస్.ఓ (NSO) డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం హెడ్ క్వార్టర్స్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయుధాన్ని శుభ్రం (క్లీన్) చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలడంతో (మిస్ ఫైర్ కావడంతో) ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆర్ఐ సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారు.