బీజింగ్ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన మొదలైంది. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్నది. చైనా డెమోక్రటిక్ పార్టీ చైర్మన్ వాంజున్ షీ చేసిన పోస్టుతోనే ఈ ప్రచారం ఊపందుకుంది. ‘బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్‌కు స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్పృహ కోల్పోయిన జిన్‌పింగ్‌ను వెంటనే విమానంలో చైనాకు తీసుకొచ్చారు. స్వాగత ఏర్పాట్లు లేకుండా రహస్యంగా హెలికాప్టర్లో ఆర్మీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇండియాలో అయితే అందరికీ తెలుస్తుందని.. అక్కడ ప్రథమ చికిత్స చేసి తీసుకొచ్చారు. ప్రస్తుతం జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదు’ అని వాంజున్ పోస్టులో తెలిపారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతుండగా జిన్‌పింగ్ తూలినట్టు కనిపించారు. దీంతో మోదీ ప్రసంగం ఆపి.. అంతా బాగానే ఉందా అని అడిగినట్టు సమాచారం. మోదీ ఇచ్చిన విందుకు జిన్‌పింగ్ హాజరు కాకుండానే చైనా వెళ్లిపోయారు. అప్పటి నుంచే అనుమానాలు పెరుగుతున్నాయి.