నరేంద్ర మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు లేని సమయాన
కనీసం కార్మిక సంఘాలతో ఏ మాత్రం చర్చ లేకుండానే 2020లో అప్రజాస్వామికంగా ఆమోదించింది. ప్రతిపక్షాలతోపాటు దేశంలోని
అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఇప్పటికే ఐదుసార్లు జరిగిన సార్వత్రిక సమ్మెల్లో పాల్గొని 50 కోట్ల మంది కార్మికులు
నిరసన వ్యక్తం చేసినా ఎంతమాత్రం పట్టించుకోకుండా మోదీ సర్కార్ లేబర్ కోడ్లను ఆమోదించుకున్నది.
2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కోడ్లను అమల్లోకి తీసుకవస్తామని కేంద్రం 2025 నవంబర్ 26న ప్రకటించింది. దీనిని అత్యంత దుర్మార్గమైనదని కార్మిక సంఘాలు అభివర్ణిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధీనంలో ఉన్న కార్మిక శాఖలో నాలుగు లేబర్ కోడ్లపై రాష్ట్ర అసెంబ్లీల అభిప్రాయాలను తీసుకోకుండానే ఏకపక్షంగా అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించడం కార్మిక వర్గం మెడకు ఉరితాళ్లు బిగించడమే అవుతున్నది.
నిజానికి 29 కార్మిక చట్టాల్లో కార్మిక నష్టపరిహార చట్టం 1923, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చట్టం 1926, స్టాండింగ్ ఆర్డర్ల చట్టం 1946, వేతనాల చెల్లింపు చట్టం 1936 మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనివి. ఈ నాలుగు చట్టాలు తప్ప మిగిలిన 25 కార్మిక చట్టాలు 1947 తర్వాత రూపొందించినవే. అయితే, బ్రిటిష్ కాలపు నాటి వలస చట్టాలను మారుస్తున్నట్టు మోదీ ప్రభుత్వం చెప్పే మాటలు కార్మికులను మోసం చేసేందుకు చెప్పే అబద్ధాలు మాత్రమే. ప్రజాస్వామ్యబద్ధమైన స్ఫూర్తికి భిన్నంగా మోదీడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకరావడం, వాటి అమలుకు పూనుకోవడం కార్పొరేట్ ప్రయోజనాల కోసం 50 కోట్ల మంది కార్మికులకు ద్రోహం తలపెట్టే వైఖరి తప్ప మరొకటి కాదు. అయితే, నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఎంతో ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్నది.
కార్మికుల సంఘంలో ఉంటే వారిని యాజమాన్యాలు అదిలించి, బెదిరించి కార్మిక సంఘాలనే తమ నియంత్రణలోకి తీసుకురావడానికి తోడ్పడే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పర్మినెంట్ కార్మికులు లేకుండా పని గ్యారెంటీ లేకుండా చేసేందుకు కోడ్ చాప్టర్ 1 సెక్షన్ 2(0) ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చట్టబద్ధం చేస్తుంది. అంటే ముందస్తు నోటీసు, నోటీస్ పే ఏమీ లేకుండానే తొలగించటం, పనిలో, గనిలో కార్ఖానాల్లో, పర్మినెంట్ కార్మికులను, సంఘాలను లేకుండా చేయటమే దీని ఉద్దేశం.
ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం 10 అధ్యాయం ప్రకారం 99 మంది కార్మికులు పనిచేసే సంస్థను మూసివేయాలంటే యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ 300 మంది కార్మికులు ఉన్న సంస్థలను మూసివేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని లేబర్ కోడ్లలో పేర్కొంటున్నది. అంటే యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా సంస్థలను లే ఆఫ్ చేయడం, రీట్రెంచ్ చేయడం, మూసివేయటం చేయవచ్చని ప్రభుత్వం హామీ ఇస్తున్నది. ఇందువల్ల 74 శాతం మంది కార్మికులకు ప్రమాదం జరుగనున్నది.
పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 22 ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీస్‌లో 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వవచ్చు. సెక్షన్ 23 ప్రకారం ఇతర సంస్థల్లో 14 రోజుల ముందు సమ్మె నోటీసు ఇవ్వవచ్చు. కొన్ని సంస్థల్లో సమ్మె నోటీసు ముందస్తుగా ఇచ్చి సమ్మెలకు వెళ్తారు. యాజమాన్యం సమస్యలు పరిష్కరించకుండా మొండికేసిన సందర్భంలోనే అనివార్యంగా కార్మికులు పోరాటానికి వెళ్లటం సహజ హక్కుగా ఉన్నది. లేబర్ కోడ్‌లో సెక్షన్ 62(1) (a)ప్రకారం సమ్మెకు, నోటీసుకు 60 రోజుల వరకు సమ్మె చేయకూడదని, కన్సిలేషన్ ముగిసిన ఏడు రోజుల్లోపు సమ్మె చేయకూడదని పేర్కొంటున్నది. సమ్మెకు ప్రోత్సహించినా, ఆర్థికంగా సహకరించినా కార్మికులను, కార్మిక నాయకులను బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 11 ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా పరిగణించి నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించి శిక్షలు వేయించటం, భారీ జరిమానాలు విధించడం చేసుకోవచ్చని లేబర్ కోడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కచ్చితంగా ఇది దేశంలో ఉన్న సంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు బిగించడం మాత్రమే.
మోదీ ప్రభుత్వం దేశాన్ని వెనుకకు నడిపించే విధంగా, మనుధర్మ కాలం నాటికి మళ్లించే విధంగా నేడు 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 నుంచి 15 గంటలు పనిచేయించాలని లేబర్ కోడ్లు పేర్కొంటున్నాయి. కంపెనీల 8.83% నుంచి 20% వరకు బోనస్ చెల్లించే అవకాశం ప్రస్తుత చట్టంలో ఉన్నది. కోడ్‌లో బోనస్ చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీల బ్యాలెన్స్ షీట్‌ను కార్మిక సంఘాలకు కార్మికులకు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నది. వేతనాల చెల్లింపు మోసాలకు పాల్పడిన యజమానులపై 10 రెట్లు పెనాల్టీ విధించి కార్మికులకు మేలు చేసే అవకాశం చట్టపరంగా ఉన్నది. కోడ్‌లో దానిని తొలగించారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపును కాంట్రాక్టర్ విస్మరిస్తే దానికి ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా యాజమాన్యాలదే బాధ్యత అని చట్టంలో ఉన్నది. లేబర్ కోడ్లు దానిని రద్దు చేసి కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి వదిలివేయటం దుర్మార్గం.
కార్మికులకు ఏ ఒక్క ప్రయోజనం కల్పించే అవకాశం నాలుగు లేబర్ కోడ్లలో లేదు. కార్మికులను కార్పొరేట్ సంస్థలు, యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే ఉద్దేశంతోనే ఈ లేబర్ కోడ్లను మోదీడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లేబర్ కోడ్లు అంటే స్మృతులు. అసమానతలు కగిన సమాజాన్ని సృష్టించటమే మనుధర్మ శాస్ర్తాన్ని రాజ్యాంగంగా భావించే ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల లక్ష్యం. ఇందుకు కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులకు సేవ చేయాలనే ఆలోచనతోనే చట్టాలను రద్దు చేసి స్మృతులను తీసుకవచ్చింది. ఈ నేపథ్యంలో 15 నెలల పాటు సుదీర్ఘంగా ఢిల్లీ కేంద్రంగా పోరాడిన రైతు సంఘాల ఉద్యమ స్ఫూర్తితో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది.
మోడీ ప్రభుత్వం దేశాన్ని వెనుకకు నడిపించే విధంగా, మనుధర్మ కాలం నాటికి మళ్లించే విధంగా నేడు 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 నుండి 15 గంటలు పనిచేయించాలని లేబర్ కోడ్లు పేర్కొంటున్నాయి. కంపెనీల 8.83% నుండి 20% వరకు బోనస్ చెల్లించే అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది. కోడ్‌లో బోనస్ చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీల బ్యాలెన్స్ షీట్‌ను కార్మిక సంఘాలకు కార్మికులకు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నది.
(వ్యాసకర్త: ఐఎఫ్టీయూతెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
-జే.సీతారామయ్య
94907 00954