Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు. విద్యార్థి ఉద్యమ జ్వాలలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సునామీలా పాకిందని అన్నారు. విద్యార్థులంతా ఏకం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదని తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. నీట్ లీకేజీపై విద్యార్థులు పోరాటం చేస్తే బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్యమకారులపై బీజేపీ నేతలు అవకాలు, చవాకులు పేలారని విమర్శించారు. వారిని దేశద్రోహులు అని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఫండింగ్ చేస్తోందని చిల్లరగా మాట్లాడారని అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని, నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పోరాడారని తెలిపారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్దంగా విద్యార్థులు విజయం సాధించారని అన్నారు.
విద్యార్థి ఉద్యమంపై బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికావని దాసోజు శ్రవణ్ అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి విద్యార్థుల బాధలు అర్థంకాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు అనవసరమైన మాటలతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. నిరసనకారులు పాకిస్తాన్ ప్రేరేపితులని బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యావ్యవస్థను సంస్కరించిండని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారని తెలిపారు. ఆందోళనకారులకు నిరసన తెలిపే హక్కు లేదని, నిరసన తెలిపితే కాల్చిచంపాలని అన్నాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పరీక్ష పత్రం లీకైతే తలెత్తే సమస్యలపై అవగాహన లేదని తెలిపారు. విద్యార్థులు కాల్చివేతలకే అర్హులైతే వారితో ఎందుకు చర్చలు జరిపారని ప్రశ్నించారు. విద్యార్థులు కణకణమండే అగ్గిరవ్వలు అని.. వారిని రెచ్చగొట్టవద్దని సూచించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు పొలికేక పెట్టారని అన్నారు. సౌదీ అరేబియాలో ఇలాంటిది జరిగితే రాళ్లతో కొట్టి చంపుతారని అన్నారు.
నీట్ పేపర్ లీక్‌తో దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని దాసోజు శ్రవణ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో మానసిక క్షోభ అనుభవించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారని ధ్వజమెత్తారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడని తెలిపారు. ఢిల్లీలో దీక్ష, హైదరాబాద్‌లో విద్యార్థుల ఆక్రోశం నీట్ పేపర్ లీక్పైనే కాదు.. ఏళ్ల తరబడి అణచివేతపై పాలకులను నిలదీస్తున్నట్లుగా అర్థమవుతోందని అన్నారు. పాలనలో ఉన్న లోపాలను విద్యార్థులు ఎత్తిచూపినట్లు తెలుస్తోందని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండి సంజయ్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. విద్యార్థులకు వారు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.