Road Accident : జన్మదిన వేడుకల కోసం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి, ఆమె బంధువు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన వాళ్లను ఓల్డ్ అల్వాల్ జొన్నబండకు చెందిన సరాక్షి (6), విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (41)గా గుర్తించారు.
తమ చిన్నారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చిన ఓ కుటుంబంలో మృత్యుఘంటికలు మోగాయి. తమ చిన్నారి సరాక్షి బర్త్ డే కోసం.. ఆదివారం సిటీకి వచ్చిన కుటుంబం కూకట్‌పల్లిలోని పీవీఆర్‌లో సినిమా చూసింది. ఆపై ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేయాలనుకున్నారు. అక్కడికి వెళ్లిన వారు మగ్ధం మోయుద్దీన్ విగ్రహం వద్ద కారు పార్క్ చేశారు. కేక్ కటింగ్ కోసం హుస్సేన్‌సాగర్ వైపు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్గం నుంచి వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొనడంతో చిన్నారి సరాక్షి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయపడిన విశ్వనాథ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.