Kusukuntla Prabhakar Reddy | చండూరు, జూలై 26: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి వల్ల నియోజకవర్గ రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వల్ల నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం చండూరు పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. డిండి నీటి పంపకాల్లో మునుగోడుకు రావాల్సిన నీటిని 440 అడుగుల వద్ద రెగ్యులేటర్ పెట్టి 436 అడుగుల వద్ద మోటర్లు బిగించి మహబూబ్‌నగర్‌కు నీటిని తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా బహిరంగంగా మునుగోడు నియోజకవర్గం ఎడారి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేస్తున్నావని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు.436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతోందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు రైతుల అవసరాలకు కేటాయించిన నీటి వాటాను సరిగా అమలు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మౌనం వహిస్తున్నారని, దీనివల్ల మునుగోడు భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ అమలు నెమ్మదిగా సాగుతోందని ఆయన ఆరోపించారు. ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వద్దని సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్‌నగర్ కు చెందిన ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చి ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కానీ ఇక్కడ ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనిని అడ్డుకోవాల్సింది పోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి మాట్లాడానని ఉత్త మాటలు చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఇకనైనా మీ ఉత్త మాటలు కట్టిపెట్టి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి డిండి ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని సూచించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ఉనికి కోసం ఆరాటపడుతున్నాడే తప్ప మునుగోడుకు సాగు, తాగు నీటిని తీసుకురావాలనే ఆలోచన ఆయనకు కొంచెం కూడా లేదని కూసుకుంట్ల విమర్శించారు. కూటిలో రాయి తీయలేనోడు.. ఏటిలోరాయి తీసిన చందంగా మునుగోడు అభివృద్ధికి నిధులు తీసుకురావాల్సింది పోయి ఇక్కడ ఉన్న నిజమైన కార్యకర్తలు పట్టించుకోకుండా ఎక్కడో నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గం వెళ్లి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఈ నియోజకవర్గాలలో పట్టించుకోవడంలేదని అరుస్తున్నాడని మండిపడ్డారు. ముందు నీ ఇల్లు సక్కపెట్టుకొని ఇతరులను అనాలి అని హితవు పలికారు. మునుగోడు నియోజకవర్గం లో నిజమైన కార్యకర్తలను పట్టించుకోకుండా, వారికి పదవులు ఇవ్వకుండా, వందల కోట్ల కాంట్రాక్టర్ల కోసం ధనార్జన ధ్యేయంగా పార్టీలు మారుతూ నీ వెంబడి ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేశావని మండిపడ్డారు.
ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి సహచర దళిత ఎమ్మెల్యేలను చులకన చేసి మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.