కండ్ల ముందు నుంచి వరద పోతుంటే, నిద్రపోయిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టుల్లో నీళ్లు లేనందున, పంటలేయొద్దంటూ రైతులకు చెప్తున్నది. పైన కర్ణాటక, కింద ఏపీ కృష్ణానీళ్లను పట్టి, పారించుకుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీజన్లో జూరాలకు 243 టీఎంసీలు వచ్చి చేరితే, మన రాష్ట్రం ఒడిసిపట్టింది కేవలం 20టీఎంసీలే. పగబట్టినట్టే వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలమూరును పడావుపెట్టింది. పనిగట్టుకొని ఉమ్మడి జిల్లాను కరువు ముఖంలోకి నెట్టింది. పొలాలు ఎండుతున్నయ్, రైతులు రోడ్డెక్కుతున్నరు. కాలువల్లో నీళ్లు లేవు. ఉన్న నీళ్లనూ రైతులు తీసుకుపోకుండా ప్రాజెక్టులపై పోలీసులను కాపలా పెట్టింది. అటు ఆంధ్రాకు నీళ్లు.. ఇటు మన రైతుకు కన్నీళ్లు!
70 కిమీల దూరంలో జూరాల కింద పంటలు ఎండబెట్టి 700 కిమీల దూరంలో ఉన్న చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నీళ్లు సాగనంపుతున్నది రేవంత్ సర్కార్. పట్టుకుపోయిన కృష్ణా నీళ్లకు చంద్రబాబు మంగళవారం జలహారతి ఇచ్చి మరీ స్వాగతించిండు. ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏండ్లు గోసపడిన పాలమూరు.. బానిస మనస్తత్వపు నేతల కారణంగా మళ్లీ అలాంటి పరిస్థితినే చూస్తున్నది. మళ్లా క్రాప్హాలిడేలా కాలాన్ని చూస్తున్నది. నీళ్లు అడిగిన రైతులపై లాఠీలు ఝళిపిస్తున్న రాజ్యాన్ని చూస్తున్నది.
సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు.. ప్రాజెక్టుల నుంచి నీళ్లిచ్చి పంటలను కాపాడాలని కాళ్లుమొక్కుతున్న రైతులు.. కరెంట్ రాక తడి అందని మడులు.. సబ్స్టేషన్లను ముట్టడిస్తున్న రైతులు.. కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేసుకోలేక కర్షకుల అవస్థలు.. ఆఖరికి వినాయక నిమజ్జనానికీ నీళ్లు లేక ట్యాంకర్లతో తెచ్చిపోస్తున్న పరిస్థితులు.. ఇదీ ఇప్పుటి దుస్థితి, దుర్గతి. గోదావరి, కృష్ణాలో వరదను వదలేసుకున్న కాంగ్రెస్ సర్కార్.. సాగునీళ్లు లేవంటూ ఇప్పుడు మొసలికన్నీళ్లు కారుస్తున్నది. నిన్నటిదాకా దేశానికి అన్నంగిన్నెగా వెలిగిన రాష్ట్రం. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో వికల దృశ్యంగా మిగిలిపోయింది.

జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతలు చల్లారలేదు. సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కూడా రైతులు పెద్దఎత్తున ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. నందిమల్ల క్రాస్‌రోడ్డు వద్దే రైతులను అడ్డుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాగునీటి నిర్వహణలో వైఫల్యం జిల్లాల మధ్య నీళ్ల కయ్యం పెడుతున్నది. సాగర్ నీటిని తలాపునే ఉన్న నియోజకవర్గాలకు ఇవ్వకుండా, ఖమ్మం జిల్లా పాలేరుకు తరలిస్తుండటాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్యయాదవ్ నాయకత్వంలో విజయవాడ హైవేపై బైఠాయించారు.

ఒకవైపు సాగునీళ్లు ఇవ్వకుండా, మరోవైపు రైతుల్ని తీసుకుపోనీయకుండా అవస్థలు పెడుతున్నది రేవంత్ ప్రభుత్వం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు ఎక్కడ తమ
పొలాలకు నీళ్లు పారించుకుంటారోనని పోలీసులను ఇలా కాపలా పెట్టింది.

ఒకవైపు కరెంటు కోతలు.. మరోవైపు లోవోల్టేజీతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు.. రైతులను గోసపుచ్చుకుంటున్నాయి. పంటలు ఎండుతున్న క్రమంలో కరెంటు కోసం కర్షకులు సాహసాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లిలో ట్రాన్స్ఫార్మర్ను సొంతంగా రిపేర్ చేయించుకుని, బిగించుకుంటున్న రైతులు.

కరెంట్ కోతల అవస్థకు, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనమీ దృశ్యం. అప్రకటిత విద్యుత్తు కోతల కారణంగా పంటలు ఎండుపోతుండటాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సబ్‌స్టేషన్‌ను చీకట్లోనే రైతులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.