రన్‌రంగం భారత్ 720/9 డిక్లేర్డ్
ఇద్దరు శతక్కొట్టారు.. మరో నలుగురు అర్ధ సెంచరీలు బాదారు..! వచ్చిన ఆటగాడు వచ్చినట్టు న్యూజిలాండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ.. వెల్లింగ్టన్ లో ‘రన్ రంగం’ సృష్టించడంతో విదేశీ గడ్డపై భారత్ అత్యధిక స్కోరుతో పాటు పలు రికార్డుల దుమ్ముదులిపింది.
- విదేశీ గడ్డపై అత్యధిక స్కోరుతో కొత్త చరిత్ర
- పంత్ శతకం n రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 119/2
ఇద్దరు శతక్కొట్టారు.. మరో నలుగురు అర్ధ సెంచరీలు బాదారు..! వచ్చిన ఆటగాడు వచ్చినట్టు న్యూజిలాండ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ.. వెల్లింగ్టన్ లో ‘రన్ రంగం’ సృష్టించడంతో విదేశీ గడ్డపై భారత్ అత్యధిక స్కోరుతో పాటు పలు రికార్డుల దుమ్ముదులిపింది. తొలి టెస్టులో గెలిచే అవకాశం, అర్హత ఇప్పుడు టీమిండియాకే ఉన్నాయి. ఆఖరి రోజు జట్టును గెలిపించే బాధ్యత ఇక బౌలర్లదే!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టును భారత్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.. రిషబ్ పంత్ (153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128) మెరుపు శతకంతో విజృంభించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 720/9 రికార్డు స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురెల్ (79 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 78) కూడా మెరుపులు మెరిపించడంతో ఓవర్‌నైట్ స్కోరు 486/4తో ఆదివారం ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం అందుకుంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన కివీస్ నాలుగో రోజు చివరకు 119/2తో నిలిచింది. క్రీజులో డెవాన్ కాన్వే (59 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర (27 బ్యాటింగ్) ఉన్నారు. చేతిలో ఇంకో 8 వికెట్లు ఉండగా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి కివీస్ ఇంకా 233 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి రోజు భారత బౌలర్లు సత్తా చాటి 8 వికెట్లు పడగొడితే గిల్‌సేన విజయం అందుకుంటుంది.
పంత్ శతకమోత..
టాప్-4 బ్యాటర్లు అద్భుతంగా రాణించి వేసిన బలమైన పునాదిపై పంత్ తనదైన శైలిలో చెలరేగి జట్టుకు రికార్డు స్కోరు అందించాడు. ఓవర్నైట్బ్యాటర్, నైట్‌వాచ్‌మన్ అన్షుల్ కాంబోజ్ (38) ఆరంభంలోనే జేమీసన్, స్మిత్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో ఇన్నింగ్స్‌ను 500 దాటించాడు. ఐదో వికెట్‌కు 68 పరుగులు జోడించిన తర్వాత ఫిలిప్స్ బౌలింగ్‌లో తను ఔటయ్యాడు. మరో ఎండ్‌లో పంత్ తనదైన షాట్లతో అలరించాడు. మోకాలిపై వంగి జేమీసన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ మైదానం పక్కనే ఉన్న కార్ల పార్కింగ్‌లో పడింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత పంత్ తొలుత రివర్స్ స్వీప్‌తో బౌండరీ కొట్టి, ఆపై స్టెయ్రిట్ సిక్సర్‌తో 135 బంతుల్లో తన 9వ టెస్టు సెంచరీ పూర్తి చేశాడు.
అదే ఓవర్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా మరో సిక్సర్ కొట్టాడు. ఇంకోవైపు ధ్రువ్ జురెల్ సైతం ధాటిగా ఆడటంతో చూస్తుండగానే స్కోరు 600 దాటింది. అయితే, లంచ్‌కు ముందు రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో పంత్ ఔటవగా, తర్వాత దాడిని కొనసాగించే బాధ్యత జురెల్ తీసుకున్నాడు. సుందర్ (24)తో ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అతను తర్వాత ఆకాశ్ దీప్ (13), బుమ్రా (7) సహకారంతో స్కోరు 700 దాటించాడు. ఫిలిప్స్ బౌలింగ్‌లో జురెల్ ఔటైన తర్వాత కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఆతిథ్య బౌలర్లలో ఫిలిప్స్ (3/154) మూడు వికెట్లు పడగొట్టగా, జాకబ్ డఫీ (1/201) ఒక్కడే ఏకంగా 200కు పైగా పరుగులు సమర్పించుకున్నాడు.
కివీస్ పోరాటం
భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే బుమ్రా షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడో బంతికి కెప్టెన్ టామ్ లాథమ్ (0)ను ఔట్ చేసిన బుమ్రా ఈసారి రెండో బంతికే అతడిని మరోసారి డకౌట్ చేసి భారత్‌కు అద్భుత ఆరంభం అందించాడు. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో హెన్రీ నికోల్స్ (31), డెవాన్ కాన్వేతో కలిసి రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు.
అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఓ షార్ట్ బాల్‌తో ఎడ్జ్ రాబట్టి జురెల్ పట్టిన క్యాచ్‌తో నికోల్స్‌ను వెనక్కి పంపడంతో కివీస్ 60/2తో డీలా పడింది. ఈ దశలో రచిన్ తోడుగా కాన్వే జట్టును ఆదుకున్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కాన్వే మూడో వికెట్‌కు రచిన్‌తో అజేయంగా 59 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
తొలి గంటే కీలకం
నాలుగు రోజుల ఆట తర్వాత భారత్‌ను విజయం ఊరిస్తోంది. కానీ, బేసిన్ రిజర్వ్ వికెట్ ఉపఖండ పిచ్‌ను తలపిస్తూ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. ఆరంభంలో ఉన్న పచ్చిక పోయి పిచ్ బిస్కెట్ రంగులోకి మారడంతో బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు. బంతి పాతబడిన తర్వాత పేసర్లు పట్టు కోల్పోతుండగా.. స్పిన్నర్ సుందర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఆఖరి రోజు తొలి గంటలో భారత్ కనీసం రెండు మూడు వికెట్లు తీయగలిగితేనే విజయావకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే మ్యాచ్ డ్రా దిశగా సాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- 720/9 తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు. విదేశీ గడ్డపై మన జట్టుకు అత్యధికం. 2010లో కొలంబోలో శ్రీలంకపై 707 స్కోరు రికార్డును భారత్ బ్రేక్ చేసింది. భారత్‌కు ఓవరాల్ గా ఇది మూడో అత్యధిక స్కోరు. ఇక, న్యూజిలాండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ లోనూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
- 108 టెస్టుల్లో రిషబ్ పంత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. ఈ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా బ్రెండన్ మెకల్లమ్ (107)ను అధిగమించి, బెన్ స్టోక్స్ (138) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
- 9 టెస్టుల్లో పంత్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. అత్యధిక శతకలు చేసి కీపర్లలో గిల్‌క్రిస్ట్ (17), ఆండీ ఫ్లవర్ (12) తర్వాత మూడో స్థానం.
- 7 భారత ఇన్నింగ్స్ లో తొలి ఏడు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. టెస్ట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 70 ప్లస్ స్కోర్లు చేయడం ఇదే తొలిసారి.
- 4 సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడం పంత్‌కు ఇది నాలుగోసారి. ఈ జాబితాలో సచిన్ (6 సార్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
- 3 రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఓవర్లోనే వికెట్ తీసిన భారత మూడో బౌలర్ బుమ్రా. శ్రీశాంత్, జహీర్ ఖాన్ ముందున్నారు.
- 1 సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్టేల్రియా (సెనా) దేశాల్లో టెస్ట్ సెంచరీలు చేసిన ఆసియా తొలి వికెట్ కీపర్ పంత్. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 368 ఆలౌట్. భారత్ తొలి ఇన్నింగ్స్: 166 ఓవర్లలో 720/9 డిక్లేర్డ్ (రాహుల్ 136, పంత్ 128, ఫిలిప్స్ 3/154). న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 45 ఓవర్లలో 119/2 (కాన్వే 59 బ్యాటింగ్, రచిన్ 27 బ్యాటింగ్, ప్రసిద్ధ్ 1/20).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

