సాగర్ దోపిడీపై సమరభేరి
‘తొలుత 5 వేల క్యూసెక్కులతో చెన్నైకి తాగునీటి పేరుతో శ్రీశైలం నుంచి మొదలైన కృష్ణాజలాల తరలింపు ఇప్పుడు నిత్యం లక్షల క్యూసెక్కుల నీటి దోపిడీకి చేరుకున్నది. నాగార్జునసాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన నీటిని వచ్చినట్టే ఏపీ సర్కార్ వందల టీఎంసీలు దోచేస్తున్నది. ఈ ఏడాది వచ్చిన వరద నీరే ఇందుకు సజీవ సాక్ష్యం. పక్కాగా నీటి హక్కులు ఉండి, పక్కనే ఉన్న నల్లగొండ, మహాబూబ్‌నగర్ జిల్లాల్లో కృష్ణానీళ్లు పారవు కానీ ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలోని చంద్రబాబు కుప్పానికి కృష్ణానీళ్లు పారుతయ్. శ్రీశైలం ప్రాజెక్టును దాదాపుగా ఏపీ చెరబట్టింది.
- ఉమ్మడి నల్లగొండ ప్రజలను ఏకం చేసి పోరాడుతం
- నాగార్జునసాగర్‌పై ఏపీ కుతంత్రాలను అడ్డుకుంటం
- శ్రీశైలాన్నీ తాగునీటి ముసుగులోనే చెరబట్టిండ్రు
- ఇప్పుడు పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో ఏపీ కుట్రలు
- చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ సర్కార్ పాలన
- సీఎంకు సోయిలేకుంటే మంత్రులకు ఏమైంది?
- కేఆర్ఎంబీకి లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టలే?
- ‘నమస్తే తెలంగాణ’తో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘తొలుత 5 వేల క్యూసెక్కులతో చెన్నైకి తాగునీటి పేరుతో శ్రీశైలం నుంచి మొదలైన కృష్ణాజలాల తరలింపు ఇప్పుడు నిత్యం లక్షల క్యూసెక్కుల నీటి దోపిడీకి చేరుకున్నది. నాగార్జునసాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన నీటిని వచ్చినట్టే ఏపీ సర్కార్ వందల టీఎంసీలు దోచేస్తున్నది. ఈ ఏడాది వచ్చిన వరద నీరే ఇందుకు సజీవ సాక్ష్యం. పక్కాగా నీటి హక్కులు ఉండి, పక్కనే ఉన్న నల్లగొండ, మహాబూబ్‌నగర్ జిల్లాల్లో కృష్ణానీళ్లు పారవు కానీ ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలోని చంద్రబాబు కుప్పానికి కృష్ణానీళ్లు పారుతయ్. శ్రీశైలం ప్రాజెక్టును దాదాపుగా ఏపీ చెరబట్టింది.
ఇప్పుడు నాగార్జుసాగర్ నీళ్ల మీదా కన్నేసింది. పల్నాడుకు తాగునీటి పేరుతో సాగర్ మధ్యలోనే కన్నం పెడుతున్నది. శ్రీశైలంలో మాదిరిగానే నాగార్జునసాగర్ నీళ్లను సైతం మళ్లించుకునేందుకు కుట్రలు చేస్తున్నది. ఇప్పుడు అడ్డుకోకపోతే సాగర్‌పైనా మనం ఆశలు వదులుకోక తప్పదు. అందుకే బీఆర్ఎస్ దీనిపై ప్రజల పక్షాన సమరభేరీ మోగించేందుకు సిద్ధమైంది’ అంటున్నారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి. సాగర్‌పై ఏపీ కుట్రలు, తెలంగాణ సర్కార్ తీరు, జిల్లా మంత్రుల స్పందన, బీఆర్ఎస్ వైఖరి తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాగర్ నుంచి ఏపీ ప్రాజెక్టును ఎలా అర్థం చేసుకోవాలి?
ఇది మరో పోతిరెడ్డిపాడే. ఇందులో సందేహం లేదు. సాగర్‌కు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఏ హక్కులూ లేకున్నా.. తమిళనాడు, కర్ణాటక మధ్య ఏదో ఒప్పందం ఉన్నదని చెప్తూ చెన్నైకి శ్రీశైలం నుంచి నీటి తరలింపు అంటూ చేసిన ద్రోహం మనకు పెద్ద అనుభవం ఉన్నది. చెన్నై తాగునీటి కోసం 5 టీఎంసీలంటూ శ్రీశైలం ప్రాజెక్టుకు మొదట చిన్న రంధ్రం వేశారు. చెన్నై పేరుతో 1,500 క్యూసెక్కుల పైప్‌లైన్ అని మొదలుపెట్టి తర్వాత 11 వేల క్యూసెక్కులు, 44 వేలు, ఇవ్వాళ 80 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోతున్నరు. ఈ ఏడాది శ్రీశైలంలో చుక్క నీళ్లు లేకుండా తరిలించుకపోయిండ్రు. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పంలో నీళ్లు పారించారు. కానీ పక్కనే ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చుక్క నీరు పారలేదు. వేలు పెట్టనిస్తే కాలు పెడుతారన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ సర్కార్, ప్రజలు మౌనంగా ఉంటే నాగార్జునసాగర్‌కు ఇదే గతి పడుతుంది.
తాగునీటి కోసమే వాటర్ గ్రిడ్ అంటున్న ఏపీ వాదనపై మీరేమంటారు?
నాగార్జునసాగర్ డ్యామ్‌కు కూతవేటు దూరంలోనే ఇన్‌టేక్‌వెల్ నిర్మాణం చేపట్టారు. ఇది నదీలోనే కడుతున్నారు. సాగర్‌లో ఎంత కిందికి నీళ్లున్నా తోడ్కొనేలా డిజైన్ చేశారు. తాగునీటి కోసమని చెప్పడం అబద్ధం. నిజంగా తాగునీటి కోసమే అయితే కుడికాలువపైనా పెట్టుకోవచ్చు. కానీ నది మధ్యలో ఎందుకు నిర్మిస్తున్నట్టు? భవిష్యత్తులో ఇక్కడి నుంచి భారీగా నీటి తరలింపే ఏపీ లక్ష్యం కావచ్చు. ఇది తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. శ్రీశైలం అనుభవం మన కండ్ల ముందుండగా సాగర్ విషయంలో ఏపీని నమ్మడానికి వీలు లేదు. అందుకే దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి.
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ తీరును ఎలా విశ్లేషిస్తారు?
సాగర్‌లో ఏపీ అక్రమ నీటి ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర నటిస్తున్నది. దీన్ని ప్రజలు క్షమించరు. చంద్రబాబు అదుపాజ్ఞల్లో సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతున్నది. అందుకే ‘ఇక మనకు ఎందుకు?’ అనే ధోరణిలో నల్లగొండ మంత్రులు ఉన్నట్టున్నారు. సీఎం వీళ్ల మాట వినేలా లేడు. వీళ్లు నిద్ర లేచి మాట్లాడేలా లేరు. ఇంత జరుగుతున్నా వీళ్లకు సోయే లేదు. మూడేండ్ల నుంచి బీఆర్ఎస్ మేల్కొలిపితే తప్ప సీఎం, మంత్రులకు రాష్ట్ర నీటి ప్రయోజనాలు పట్టడం లేదు. అది పోలవరం-బనకచర్ల కావచ్చు, పోతిరెడ్డిపాడు సమస్య కావచ్చు. సాగర్ నుంచి అక్రమ నీటి తరలింపు కావచ్చు.. ఇలా దేనిలోనైనా బీఆర్ఎస్ స్పందిస్తే, మాట్లాడితే, నిలదీస్తే, బల్లెం పట్టి పొడిస్తే తప్ప కాంగ్రెస్ సర్కార్‌లో చలనం ఉండటం లేదు. దున్నపోతులా నిద్ర పోతున్నారు. కొన్నిసార్లు నిద్ర నటిస్తున్నారు. అందుకే వీటన్నింటిపై కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలను ఏకం చేసి కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కులను కాపాడుకోవడానికి కంకణం కట్టుకొని పనిచేస్తూనే ఉన్నది.
మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చెరోమాటపై మీరేమంటారు?
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలకు కనీస సోయి లేదు. మాట్లాడితే పదవి పోతుందేమోనన్న భయం ఉన్నట్టున్నది. మంత్రి ఉత్తమ్‌కుమార్ మాటలన్నీ ఉత్తమాటలేనని తేలిపోయింది. మాకు ముందే తెలుసని ఉత్తమ్ అంటుంటే మంత్రి కోమటిరెడ్డి తమకు ఎందుకు చెప్పలేదని ఈఈని తిట్టినట్టు చెప్తున్నడు. నిజంగా కేఆర్ఎంబీకి ప్రభుత్వం లేఖ రాస్తే నేటికీ ఎందుకు బయటపెట్టలే? దీన్ని ఎందుకు మీడియాకు రిలీజ్ చేయలే? ఒక వేళ రాస్తే కేఆర్ఎంబీలో ఆ లేఖ రిజిస్టర్ అవుతది కదా? ఇలాంటివేవీ అక్కడ లేవు. కేవలం తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలు మొదలుపెట్టారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వంద అబద్ధాలు ఆడుతున్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం. ప్రజలు క్షమించరు.
ఏపీ నీళ్ల కుట్రలపై బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుంది?
సాగర్ జలాల విషయంలో ఖచ్చితమైన పోరాటం చేస్తాం. త్వరలోనే నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులం, ముఖ్య నేతలమంతా సాగర్‌కు వెళ్తాం. ఒకటి, రెండు రోజుల్లోనే సాగర్‌లో ఇన్‌టేక్‌వెల్, ఇతర పనులను పరిశీలిస్త్తాం. గతంలోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిర్యాలగూడ వచ్చినప్పుడు కూడా చెప్పారు. కృష్ణాజలాలపై పోరాటం చేయల్సిందేనని, ఎప్పుడు వచ్చేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించారు. త్వరలోనే కేటీఆర్‌ను కూడా సాగర్‌కు తీసుకువస్తాం. జిల్లా ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. సాగర్‌పై ఏపీ కుట్రలను అడ్డుకుంటాం.
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా పెత్తనం ఓ కారణం అనుకోవచ్చా?
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్, ఏపీలోని చంద్రబాబు సర్కార్.. వేర్వేరు కాదు. అమెరికాకు వెళ్లినా, ఆంధ్రాకు వెళ్లినా రెండు చోట్లా మాదే సర్కార్ అనే ధోరణి వ్యక్తం చేస్తున్నరు. అక్కడా ఇక్కడా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన నడుస్తున్నది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బాజాప్తా చెప్తున్నరు. చివరికి తెలంగాణ ఇరిగేషన్ శాఖలోనూ ఆంధ్రా అధికారులదే హవా. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు, సాగర్‌లో ఎస్ఈ, చివరికి ఇంటెలిజెన్స్‌లోనూ ఏపీ వాళ్లే ఉన్నారు. ఇక కేఆర్ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ తరఫున ఆంధ్రావాళ్లే మాట్లాడాలి. వీళ్లంతా చంద్రబాబు గ్యాంగే. వీళ్లు తెలంగాణ హక్కులను కాపాడుతారంటే ఎలా నమ్మాలి? వీళ్లను నమ్ముకుంటే తెలంగాణకు నీళ్లు వస్తాయా? అందుకే ఈ మూడేండ్లల్లో గతంలో ఎన్నడూ లేనంత అటూ గోదావరి, ఇటూ కృష్ణాజలాల్లో ఏపీ యథేచ్ఛగా నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

