తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రా డామినేషన్!
పేరుకే తెలంగాణ ఇరిగేషన్ శాఖ. కీలక స్థానాలన్నింటిలోనూ ఆంధ్రా మూలాలున్నవారే. ఉద్యోగ విరమణ పొందినా సరే మళ్లీ వారికే బాధ్యతల అప్పగింత. సెక్రటేరియట్ పేషీ మొదలు.. ఈఎన్సీ ఆఫీస్ వరకూ అంతా వారే. తెలంగాణ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వరు. ఆ ఫైలు ముందుకు కదలదు. వెరసి తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడవు. మరోవైపు, పొరుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా బయటకు పొక్కవు. కనీసం ప్రభుత్వానికి సైతం చేరవు.
- తెలంగాణ గర్భశోకం
- శాఖలో గుత్తాధిపత్యం.. ప్రాజెక్టులపై పెత్తనం వారిదే
- సాగునీటి రంగంలో కీలక స్థానాలన్నీ వారి చేతిలోనే..
- వారి కుర్చీలకు ఎసరొస్తుందని ప్రమోషన్లకు అడ్డుకట్ట
- క్లియర్ వేకెన్సీలున్నా ఉద్యోగోన్నతుల్లో కోతలు?
- సీనియర్లను కాదని జూనియర్లకు ‘అదనపు’ పగ్గాలు
- ఉద్యోగ విరమణ పొందినా.. వారికే కీలక బాధ్యతలు
- మన ప్రాజెక్టులు ముందలపడకుండా అడ్డంకులు!
- ఏపీ జలదోపిడీ తెలిసినా దాచిపెట్టేలా వ్యవహారాలు
- సర్కార్ అండతోనే ఈ దుస్థితి అంటున్న ఇంజినీర్లు
- కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా శ్రీనివాస్‌కు పోస్టింగ్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పేరుకే తెలంగాణ ఇరిగేషన్ శాఖ. కీలక స్థానాలన్నింటిలోనూ ఆంధ్రా మూలాలున్నవారే. ఉద్యోగ విరమణ పొందినా సరే మళ్లీ వారికే బాధ్యతల అప్పగింత. సెక్రటేరియట్ పేషీ మొదలు.. ఈఎన్సీ ఆఫీస్ వరకూ అంతా వారే. తెలంగాణ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వరు. ఆ ఫైలు ముందుకు కదలదు. వెరసి తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడవు. మరోవైపు, పొరుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా బయటకు పొక్కవు. కనీసం ప్రభుత్వానికి సైతం చేరవు. ఇదీ దుస్థితి. నాగార్జునసాగర్ జలాశయం నుం చి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టు పనుల అంశంతో ఇరిగేషన్ శాఖలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ ప్రభుత్వంలో.. తెలంగాణ అధికారులపైనే ఆంక్షలు, వివక్ష కొనసాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అడుగు తీసినా, పెదవి కదిపినా ఎక్కడికక్కడ నిఘా నీడ వెంటాడుతున్నది. ప్రభుత్వం తీరుపై తెలంగాణ ఇంజినీర్లు రగిలిపోతున్నారు.
అడుగడుగునా ఏపీ స్థానికత అధికారులకే అందలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులకే పట్టంకడుతున్నది. ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు, కీలక పోస్టుల భర్తీ, అదనపు బాధ్యతల కేటాయింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. అర్హత, సీనియారిటీ, ఖాళీల ఆధారంగా ప్రమోషన్లు కల్పించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కొందరికే ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా ‘అదనపు బాధ్యత’ల పేరుతో జూనియర్ అధికారులకు కీలక స్థానాలు కట్టబెడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారాలన్నింటిలో శాఖలోని కీలక స్థానాల్లో ఉన్న ఏపీ స్థానికతకు చెందిన నలుగురు అధికారులు చక్రం తిప్పుతున్నారన్న చర్చ ఇంజినీరింగ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే
ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారుగా గతంలో ఏపీలో కీలకంగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించింది. ఆయన గతంలో తెలంగాణ కీలకమైన ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితోపాటు ప్రతి ప్రాజెక్టునూ వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.సెక్రటేరియట్లో సెక్రటరీ తరువాత అత్యంత కీలకమైన పోస్టు జాయింట్ సెక్రటరీ (టెక్నికల్). తెలంగాణ ప్రాజెక్టుల పనులు, సాంకేతిక అంశాలన్నీ ఈయన పర్యవేక్షణలో కొనసాగుతాయి. నిబంధనల ప్రకారం ఆ పోస్టులో చీఫ్ ఇంజినీర్ని నియమించాలి.
కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం అప్పటికి కనీసం రెగ్యులర్ ఎస్ఈగా కూడా ప్రమోషన్ పొందని, ఏపీ స్థానికత కలిగిన కే శ్రీనివాస్‌ను జేఎస్గా నియమించింది. సదరు అధికారికే ఈఎన్సీ జనరల్ ఆఫీస్‌లో డిప్యూటీ ఈఎన్సీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా మళ్లీ ఆయనకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ స్థానికత కలిగిన ఒకే వ్యక్తికి మూడు కీలక బాధ్యతలు! ఈ నెల 4వ తేదీన జీవో-542 ద్వారా శ్రీనివాస్‌కు ఎండీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బరాజ్ వ్యవహారంలో విజిలెన్స్ విచారణ, పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కీలకంగా వ్యవహరించిన అధికారిగా శ్రీనివాస్‌పై ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ విషయంలో ఆయన వైఖరిపై కొందరు ఇంజినీర్లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను కేఐపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించడం చర్చనీయాంశమైంది. ఈ నియామకంలో అనుసరించిన ప్రమాణాలు, నిబంధనలు ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెక్రటేరియట్ జేఎస్ తరువాత అత్యంత కీలకమైన పోస్టు డీడీఎం (డిప్యూటీ డైరెక్టర్ మానిటరింగ్). ఈ పోస్టులో సైతం కాంగ్రెస్ సర్కార్ ఏపీ స్థానికత కలిగిన, అందులోనూ ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌ను నియమించింది.
సెక్రటేరియట్‌లోని విజిలెన్స్ విభాగంలోనూ ఈఈగా ఏపీ స్థానికత కలిగిన ఇంజినీర్నే నియమించింది. ఆయననే ఈఎన్సీ అడ్మిన్ ఆఫీస్‌లో డీడీఏ (డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్)గా సైతం కొనసాగిస్తున్నది. ఈఎన్సీ జనరల్‌గా ఏపీ స్థానికతకు చెందిన ఓవీ రమేశ్‌బాబును నియమించింది. ఆయన ఉద్యోగ విరమణ పొందినరోజే కాంట్రాక్టు ప్రాతిపదికన సర్వీసును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఇటీవల ఆ గడువు సైతం ముగియగా, మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఓఎస్డీగా నియమించుకున్న భీమ్‌ప్రసాద్ కూడా ఏపీ స్థానికతకు చెందినవారే. ఎస్ఈగా ఉద్యోగ విరమణ పొందిన తదుపరి మళ్లీ ఆయననే ప్రభుత్వం నియమించుకున్నది.
ఇరిగేషన్లో మరో అత్యంత కీలకమైన పోస్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగం. అక్కడ కూడా ఏపీ స్థానికతకు చెందిన మధుసూదన్‌రావును ఇటీవల ఈఎన్సీగా నియమించింది. ఆయనకు కీలకమైన కరీంనగర్ ఈఎన్సీగా సైతం అదనపు బాధ్యతలు అప్పగించింది. సూర్యాపేట సీఈగా సైతం ఏపీ స్థానికతకు చెందిన నాగభూషణరావును నియమించింది. అత్యంత కీలకమైన కమిషన్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)లోని ఓ కీలకమైన స్థానంలోనూ ఏపీ స్థానికతకు చెందిన ఇంజినీర్నే నియమించింది.
మరోవైపు, హైదరాబాద్ సీఈ పరిధిలో అవినీతి అక్రమాల పేరిట ఒకేసారి 106 మంది ఇంజినీర్లను కాంగ్రెస్ సర్కార్ గతంలో బదిలీ చేసింది. అయితే, ఆ సీఈ పరిధిలోని తెలంగాణ ఇంజినీర్లను తప్పించి, ఏపీ స్థానికత కలిగిన ఇంజినీర్లను అక్కడ నియమించడం గమనార్హం. ఎన్వోసీల జారీలో కీలకంగా వ్యవహరించే స్థానంలో ఏపీ ఇంజినీర్‌ను నియమించింది. ఈఎన్సీ అడ్మిన్ ఆఫీస్‌లో డిప్యూటీ ఈఎన్సీ పోస్టులోనూ ఏపీ స్థానికత చెందిన అధికారికే ప్రభుత్వం పట్టం కట్టింది.

అదనపు ‘ముడుపులు’
క్షేత్రస్థాయిలో కీలక పనులు కొనసాగుతున్న చోట సైతం ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులకే, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా నియమించడం కాంగ్రెస్ సర్కార్‌లో పరిపాటిగా మారింది. అనేక చోట్ల అన్ని క్యాడర్లలో 2005 బ్యాచ్ ఇంజినీర్లను పక్కన పెట్టి 2007, 2008 బ్యాచ్ ఇంజినీర్లకు పగ్గాలు అప్పగిస్తున్నది. అర్హతలేనివారు వివిధ రకాలుగా దొడ్డిదారుల్లో ‘అదనపు బాధ్యతలు’ పొందుతూ రెండు డ్యూటీలు చేస్తున్నారు. ఈ విధానం రోజురోజుకూ విచ్చలవిడిగా పెరుగుతున్నది. ఏ సత్యనారాయణరెడ్డి సీఈగా ఏప్రిల్ 2026న ఉద్యోగ విరమణ పొందగా, ఆయనకు సీఈ మహబూబ్‌నగర్, సీఈ హైదరాబాద్, సీఈ కమిషనర్ హైడ్రా పేరిట మూడు పోస్టులకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్ సీఈగా, ఎస్ఈగా విజయభాస్కర్‌రెడ్డి ఎక్స్టెన్షన్పైనే కొనసాగుతున్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సీఈగా కొనసాగుతున్న కే ప్రసాద్‌కు ఈఎన్సీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తంగా 15 మంది ఎస్‌ఈలే సీఈలుగా, 16 మంది ఈఈలు ఎస్ఈలుగా ‘అదనపు బాధ్యత’ల్లో కొనసాగుతున్నారు.. అంటే ఒక్కొక్కరు రెండేసి పోస్టుల్లో కొనసాగుతున్నారు. అందులో అనేకమందికి సీఈ ప్రమోషన్లలో అర్హతలు లేకపోవడంతోనే ఉన్నతాధికారులకు ముడుపులు ముట్టజెపుతూ దొడ్డిదారుల్లో ‘అదనపు బాధ్యతలు’ చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారని శాఖ ఇంజినీర్లు మండిపడుతున్నారు. బెల్లంపల్లి ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈగా చెన్నూరు డివిజన్-2 ఈఈగా 2004వ బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే సరిలో మోస్టు సీనియర్, 1992 బ్యాచ్‌కు చెందిన ఈఈ ప్రభాకర్‌ను ప్రభుత్వం పక్కనపెట్టింది.
మహదేవపూర్ డివిజన్-1 అంబట్పల్లి సబ్ డివిజన్-5లో డీఈఈగా సురేశ్‌కుమార్‌కు మేడిగడ్డ డివిజన్ ఈఈగా అడిషనల్ చార్జ్ అప్పగించింది. డీఈఈపై విజిలెన్స్ కేసులున్నాయి. ఈయన 2007వ బ్యాచ్‌కు చెందిన ఇంజినీర్. నిబంధనల ప్రకారం ఎలా చూసినా అడిషనల్ చార్జ్ ఇవ్వరాదు. ‘అదనపు బాధ్యత’ల కొనసాగింపు వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నదని శాఖ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో కీలక స్థానాలను ఆక్రమించిన ఏపీ స్థానికత కలిగిన అధికారుల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తున్నది. కీలక స్థానాల్లో పాగా వేసిన ఏపీ స్థానికతకు చెందిన ఇంజినీర్లే ఇరిగేషన్ శాఖలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.
అనేకచోట్ల సీఈలు, ఎస్ఈలు, అనేక సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ, తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ఏకంగా ప్రమోషన్లను అడ్డుకోవడమేగాక, తెలంగాణ సీనియర్ ఇంజినీర్లకు తీరని ద్రోహం తలపెడుతున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లకు అర్హులైన అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అక్టోబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సీఈ, ఈఎన్సీ కలిపి 19, ఎస్ఈలు 16, ఈఈ స్థాయిలో 51, డీఈఈ స్థాయిలో 25 ఖాళీలున్నాయి.
ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం ప్రమోషన్లతో భర్తీ చేస్తే ఎస్ఈ నుంచి సీఈగా 19 మందికి, ఈఈ నుంచి ఎస్ఈగా 35 మందికి, డీఈ నుంచి ఈఈగా 86 మందికి, ఏఈఈ నుంచి డీఈగా 111 మందికి అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ వర్గాలు చెప్తున్నాయి.. అయితే ఎస్ఈ నుంచి సీఈగా ఆరుగురికి, ఈఈ నుంచి ఎస్ఈగా 12 మందికి, డీఈ నుంచి ఈఈగా 55 మందికి, ఏఈఈ నుంచి డీఈగా 30 మందికి మాత్రమే అవకాశం కల్పించేలా కసరత్తు జరుగుతున్నదని సమాచారం. మిగిలిన ఖాళీలను రెగ్యులర్ ప్రమోషన్లతో భర్తీ చేయకుండా ‘అదనపు బాధ్యత’లతో కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
వారిదే ఏకఛత్రాధిపత్యం.. ఏపీకి దాసోహం
ఇరిగేషన్ శాఖలో పరిపాలన, సాంకేతికపరమైన అన్ని నిర్ణయాల్లోనూ ఏపీ స్థానికతకు చెందిన అధికారులదే పెత్తనంగా మారింది. దీంతో వారు తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు ముందు పడకుండా శతవిధాలా అడ్డుకుంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సదరు అధికారులేనని తెలుస్తున్నది. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులు సైతం పురోగతికి నోచుకోలేని దుస్థితికి కారణం కీలకస్థానాల్లో కుదురుకున్న ఏపీ అధికారేలేనని ఇంజినీర్లు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించి పనులు, ఇతరత్రా నిర్ణయాలపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) నిర్ణయం తీసుకుంటుంది. అందులో అన్ని ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలు ఉంటారు. ఒకసారి ఎస్ఎల్ఎస్సీ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
ఎస్ఎల్ఎస్సీ సిఫార్సు చేసిన ప్రాజెక్టుల ఫైల్స్‌పై సైతం కీలక స్థానాల్లోని ఏపీ అధికారులు కొర్రీలు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి, రివర్ బోర్డుల నుంచి తెలంగాణకు వచ్చే కీలకమైన లేఖలు, సమాచారాన్ని బయటకు పొక్కకుండా సదరు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాశయం నుంచి పల్నాడు వాటర్ గ్రిడ్ స్కీమ్‌ను చేపట్టింది. నాలుగు నెలల క్రితమే జీవో జారీ చేసింది. ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చే వరకూ ఆ వివరాలేవీ బయటకు పొక్కకుండా తొక్కిపెట్టింది కూడా సదరు ఇంజినీర్లేనని తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

