ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేట భూములంటేనే కోట్లు కురిపించే హాట్ కేక్ లాంటి ప్లాట్లుగా భావించేవారు. ఇకడ ఎకరం ధర వందల కోట్లు పలికి రికార్డు సృష్టించడంతో, భవిష్యత్తుపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరంలో రియల్ ఎస్టేట్ మందగమనానికి, మారెట్ పడిపోవడానికి అద్దం పడుతూ హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలానికి రియల్టర్లు ముఖం చాటేస్తున్నారు.
కోకాపేటతోపాటు పలు కీలక వెంచర్లకు రియల్టర్ల నుంచి అత్తెసరు స్పందన లభిస్తోంది. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ లోని ప్లాట్ నంబర్ 17లోని 4.59 ఎకరాల ప్లాట్‌కు ఇటీవల వేలం నిర్వహించింది. రూ. వందల కోట్ల విలువైన ఈ భూమికి తాజాగా వేలం నిర్వహించినప్పటికీ కేవలం సింగిల్ బిడ్ మాత్రమే రావడంతో హెచ్ఎండీఏ ఆ వేలాన్ని రద్దు చేసింది. బహుళ అవసరాల జోన్ కింద ఉన్న ఈ లేఅవుట్ లో ఇప్పటికే 60 అంతస్తుల భారీ వాణిజ్య, నివాస, వ్యాపార భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. తొలిసారి వేలంలో ఇకడ ఎకరం రూ. వంద కోట్లు దాటి రికార్డు సృష్టించడంతో ఈసారి కూడా భారీ ధర పలుకుతుందని అధికారులు భావించారు. అయితే, ఇటీవల జరిగిన వేలంపాటలో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు కావడంతో హెచ్ ఎండీఏ పునరాలోచనలో పడింది. గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అధ్వానంగా మారింది.
అడపాదడపా ప్రభుత్వం వేలం నిర్వహిస్తున్న అత్తెసరు స్పందన మాత్రమే వస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వీటిలో వందలాది ప్లాట్లు వేలానికి వచ్చిన ఆశించిన స్థాయిలో సర్కారుకు రాబడి రావడం లేదు. దీంతోపాటు మార్కెట్లో భారీగా పడిపోయిన క్రయవిక్రయాలు కూడా బడా వ్యాపారులను కలవరపెడుతున్నాయి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి, వ్యాపారం లేకపోతే, వ్యాపార చక్రం ఆగిపోతుందని భావిస్తున్నారు. దీనికి తోడు భారీ ప్రాజెక్టుల విషయంలో సర్కారు పెద్దల వేధింపులు, హైడ్రా కూల్చివేతలు కూడా కొనుగోలుదారులను, పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. ఈ కారణంగానే హాట్ కేకుల్లాంటి కోకాపేట్ భూములను మార్కెట్లో పెట్టిన కొనేవారు కరువయ్యారని తెలుస్తోంది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించడం, పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తుండటమే ఈ నిరాధరణకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
భూముల వేలానికి స్పందన కరువైంది. కానీ హెచ్ఎండీఏ ఆశలు మాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లలో మరో విడత ప్లాట్ల వేలానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కోకాపేట్ భూములతోపాటు, లేమూరు, ఇస్మాయిల్ నగర్, బాచుపల్లి, మోకిలాల్లో మిగిలిన ప్లాట్లకు వేలం వేయాలని యోచిస్తోంది. అయితే ఈ వేలం ప్రక్రియల ద్వారా ఆశించిన మొత్తంలో రెవెన్యూ రాకపోవడంతోనే మరోసారి ఈ భూములను వేలం వేయడానికి సిద్ధం అవుతుంది. కోకాపేటలోని 4.59 ఎకరాలకు కూడా వేలం నిర్వహించి దాదాపు రూ. 1000 కోట్లు సొమ్ము చేసుకోవాలని ఆశలతో హెచ్ఎండీఏ ఉంది.