హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘లక్కీ భాస్కర్’ సినిమా తరహాలో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. సినిమా కథనే తలదన్నేలా ప్రైవేట్ సంస్థల్లో లక్షల రూపాయల పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో లక్షల ఇన్వెస్ట్మెంట్స్, ఖరీదైన కార్లు, కోటిన్నర వరకు వడ్డీలకు తిప్పుతూ.. కళ్లు చెదిరే ఫ్లాట్లలో తన అక్రమాస్తుల సామ్రాజ్యాన్ని విస్తరించారు. వివాదాస్పదుడిగా పేరుగాంచడం, అక్రమంగా డబ్బులు సంపాదిస్తుండటంతో ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టి కూపీలాగారు. ప్రాథమిక పరిశీలనలోనే భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఆయన నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు సంబంధించిన 7 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.
ఏసీబీ అధికారులు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ, ఆయా ఆస్తుల మారెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఏసీబీ తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.80 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. మరిన్ని ఆస్తులపై అదనపు ధ్రువీకరణ, పరిశీలన సాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కూకట్పల్లి, మణికొండలో ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితోపాటు భువనగిరి, నందిగామ, శామీర్‌పేటలో ఓపెన్ ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ 800 చదరపు గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. లక్షల విలువైన జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ వంటి విలాసవంతమైన కార్లు, లక్షల విలువైన గ్యాడ్జెట్స్, అరకిలోకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు తేల్చారు. దీనికితోడు ప్రైవేట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో లక్షలు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించారు. రూ.41 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.12 లక్షల పోస్టాఫీస్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు నిర్ధారించారు.