Fever | వర్షాకాలం మొదలవగానే జ్వరం కేసులు ఒక్కసారిగా పెరుగుతుంటాయి. స్వల్ప జ్వరం వచ్చినా అది సాధారణ వైరల్ ఇన్ఫెక్షనా, లేక డెంగీ ప్రారంభ లక్షణమా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. తొలి రెండు రోజుల్లో ఈ రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండటంతో తేడాను గుర్తించడం కష్టమవుతుంది. అందుకే వైద్య నిపుణులు సూచించే 48 గంటల జ్వరం నియమం (48-Hour Fever Rule)ను పాటించడం చాలా ముఖ్యం. జ్వరం 48 గంటలు దాటినా తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. వైరల్ ఇన్ఫెక్షన్ అయినా, డెంగీ వైరస్ అయినా శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ ఒకే విధంగా స్పందిస్తుంది. జ్వరాన్ని కలిగించే రసాయనాలను విడుదల చేసి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందువల్ల మొదటి 48 గంటల్లో కేవలం లక్షణాల ఆధారంగా వైరల్ జ్వరమా, డెంగీనా అని నిర్ధారించడం చాలా కష్టం. అందుకే ఈ దశను వైద్యపరంగా అత్యంత కీలకమైన సమయంగా పరిగణిస్తారు.
పరిశోధనల ప్రకారం, డెంగీ ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు సాధారణ వైరల్ జ్వరాన్ని పోలి ఉంటాయి. ముఖ్యంగా డెంగీ ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో తొలి రెండు రోజుల్లో రక్త పరీక్షలు లేదా వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. ఎందుకంటే 48 గంటల తర్వాతే ఈ రెండు వ్యాధుల లక్షణాల్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. సాధారణ వైరల్ జ్వరం ఎక్కువగా విశ్రాంతి, తగినంత ద్రవాలు తీసుకోవడం, పారాసిటమాల్ వంటి మందులతో కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ డెంగీలో మాత్రం జ్వరం కొనసాగడమే కాకుండా శరీర పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జ్వరం రెండు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే లేదా మందులు తీసుకున్నా అధికంగానే కొనసాగితే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లో డెంగీ NS1 యాంటిజెన్ పరీక్ష చేయించుకుంటే వైరస్ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష చేయించడం ద్వారా ప్లేట్లెట్లు, హీమాటోక్రిట్ స్థాయిలను తెలుసుకోవచ్చు. తద్వారా వ్యాధి తీవ్రతను అంచనా వేయడం సులభమవుతుంది.
చాలామంది జ్వరం తగ్గిన వెంటనే ప్రమాదం పూర్తిగా ముగిసిందని భావిస్తారు. అయితే డెంగీలో నిజమైన ప్రమాద దశ జ్వరం తగ్గిన తర్వాతే ప్రారంభమవుతుంది. సాధారణంగా మూడో రోజు నుంచి ఐదో రోజు మధ్య ప్లాస్మా లీకేజ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రక్తం చిక్కబడటం, ప్లేట్లెట్ సంఖ్య వేగంగా తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన డెంగీ కేసుల్లో అంతర్గత రక్తస్రావం, శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఈ దశలోనే ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జ్వరం ఉన్న సమయంలో వైద్యుల సూచన మేరకు పారాసిటమాల్ మాత్రమే ఉపయోగించాలి. ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను తీసుకోవద్దు. ఇవి రక్తాన్ని పలుచన చేసి, డెంగీ ఉంటే అంతర్గత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. శరీరంలో నీటి కొరత రాకుండా తగినంత ద్రవాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కేవలం నీరు మాత్రమే కాకుండా ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీరు, కూరగాయల సూప్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ద్రవాలు, లవణాలు అందుతాయి.
అలాగే నిరంతర వాంతులు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, అసాధారణమైన అలసట లేదా నీరసం వంటి హెచ్చరిక లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. వర్షాకాలంలో వచ్చే ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని భావించి భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో జ్వరం 48 గంటలు దాటినా తగ్గకపోతే నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదకరం. లక్షణాల వ్యవధిని గమనిస్తూ, అవసరమైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా డెంగీని ప్రారంభ దశలోనే గుర్తించి తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. అలాగే దోమల కాటుకు దూరంగా ఉండడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, తగినంత ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.