భువనేశ్వర్: హిందుత్వ కార్యకర్త రవీంద్ర పాల్ అలియాస్ ధారా సింగ్(Dara Singh)ను ముందస్తుగా రిలీజ్ చేసేందుకు ఒడిశా సర్కారు వ్యతిరేకించింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్రహం స్టెయిన్స్తో పాటు అతని ఇద్దరు మైనరు కుమారులను హత్య చేసిన కేసులో ధారా సింగ్ జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. 1999లో కిరణ్జార్లో ఆ మర్డర్ జరిగింది. అయితే ధారా సింగ్ పెట్టుకున్న రిలీజ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఇవాళ అధికారులు చెప్పారు. ఇప్పటికే జైలులో 25 ఏళ్లు గడిపినట్లు ధారా సింగ్ తన అభ్యర్థనలో నివేదించాడు. అయితే ఈ కేసును పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు.. దీనిపై ఒడిశా సర్కారు తుది నిర్ణయాన్ని తీసుకోవాలని సూచన చేసింది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీన జరిగిన స్టేట్ సెంటెన్స్ రివ్యూ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ దశలో ముందస్తుగా ధారాసింగ్ను రిలీజ్ చేయడానికి సుముఖంగా లేనట్లు బోర్డు పేర్కొన్నది. 2016, 2019, 2020, 2022, 2023లో పెట్టుకున్న అభ్యర్థనలను కూడా తిరస్కరించినట్లు బోర్డు చెప్పింది. హోంశాఖ అదనపు కార్యదర్శి హేమంత శర్మ నేతృత్వంలో మరో అయిదు మంది బోర్డు సభ్యులు మీటింగ్లో పాల్గొన్నారు.