హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనను తొలగించడం అన్యాయమంటూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసి అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమించడం ఏకపక్షమని ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రేణుక యారా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, జగన్‌పై అంబుడ్స్‌మన్ అనర్హత వేటు వేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
పిటిషనర్‌ను తొలిగించి మరో వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడం ఏకపక్షమన్నారు. నిధుల వినియోగంపై అవతకవలు జరిగాయనే ఆరోపణలు రుజువు కాకుండానే అనర్హత వేటువేయడం సరికాదన్నారు. పోలీస్ కేసు మాత్రమే ఉందని, అభియోగాలు నిరూపణ కాలేదన్నారు. దీనిపై హెచ్‌సీఏ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ఈ పిటిషన్ కొట్టేయాలని.. దీనికి విచారణార్హత లేదని చెప్పారు. కింది కోర్టులో సవాలు చేయాల్సిందన్నారు. దీని విచారణార్హతపై ఈనెల 18న విచారిస్తామని ప్రకటించింది.