Wangchuk CJP | కలిసికట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం వల్ల స్పష్టమైంది. కానీ విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ చేసుకున్న సంబురాల వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతుంది. దీనిపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. గౌరవంతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా సంబురాలు జరుపుకోవాలని సామాజిక కార్యకర్తలు, తన మద్దతుదారులను కోరారు.
ఆ వీడియోలు యువతరం స్ఫూర్తికి ప్రతిబింబం
సంబురాల వీడియోలపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీజేపీ స్పోక్స్పర్సన్ సౌరవ్ దాస్ ‘X’లో స్పందించారు. మేం ఎంత సమయమైనా రోడ్డుపై బైఠాయించగలం. కోల్డ్ కాఫీ తాగుతూ సంఘటితమవ్వగలం. డాన్స్ చేస్తూ నిరసన తెలపగలం. ఇదే ఈతరం స్వభావం అని అన్నారు. సృజనాత్మకత, దృఢత్వం ఉన్న జెన్ జడ్ తరాన్ని ఒకే మూసలో ఇరికించడం సాధ్యం కాదు.
విజయం తరువాత చేసుకున్న సంబురాల వీడియోలు యువతరం స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని, జెన్ జడ్ ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తున్నాయని అన్నారు. అయితే కొంతమందికి నేటి యువతరం భాష అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. ఎవరేమనుకున్నా నేటి జెన్ జడ్ యువత ఇలాగే ఉంటుందని అన్నారు.

Saurav Das